ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. వైసీపీ ఎంపీ రఘురామ రాజు కోర్టుకు ఎక్కిన నేపథ్యంలో రాజకీయంగా ఈ విషయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ బెయిల్ రద్దు కావడం దాదాపు ఖాయమని అందరూ అంటున్నారు.
ఈ క్రమంలో ఆయన జైలుకు వెళ్తే.. తదుపరి ముఖ్యమంత్రి మాట ఎలా ఉన్నప్పటికీ.. అసలు పార్టీ ఉంటుందా? లేక తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత జైలుకు వెళ్లిన తర్వాత.. ఆ పార్టీలో ఏర్పడిన `చీలిక` రాజకీయం వైసీపీలోనూ వస్తుందా? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం జగన్ తన పార్టీని కుటుంబ సభ్యుల వాసనలు పడకుండా.. అత్యంత జాగ్రత్తగా నడిపిస్తున్నారనేది వాస్తవం.
ఎంతో మంది కుటుంబ సభ్యులు, బంధువులు పార్టీలోనే ఉన్నప్పటికీ.. ఎవరిని ఎంత వరకు ఉంచాలో అంత వరకే ఉంచుతున్నా రు. కానీ, ఇప్పుడు జగన్ జైలుకు వెళ్తే.. అనే ప్రశ్న తెరమీదకి వచ్చినప్పుడు.. బంధువర్గం.. అధికారం చలాయించేందుకు లేదా.. పార్టీలో తమకు అనుకూలంగా ఉన్నవారిని తమవైపు తిప్పుకొని ఏకంగా పార్టీని చీల్చేందుకు ప్రయత్నించినా.. ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని.. విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ విషయంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మరోసారి చర్చకు వస్తున్నారు. ఇటీవల ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యానించినట్టు.. కేవలం వైఎస్ తనయుడు అనే ఒకే ఒక్క ఇమేజ్ తప్ప.. జగన్‌కు ఏమీలేదని.. వైఎస్ కుటుంబ సభ్యులు కూడా భావిస్తున్నారు.
బహుశ దీనిని గ్రహించారో.. ఏమో.. జగన్ ఇటీవల కాలంలో వైఎస్ పేరును కొన్ని వర్గాలకు.. లేదా కొన్ని పథకాలకు మాత్రమే పరిమితం చేసి.. ఎక్కువ వర్గాలకు తనను తాను చాటుకుని, తన ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల పేర్లను గమనిస్తే.. ఎక్కువ పేర్లు జగన్‌వే ఉన్నాయి.
తొలి ఏడాది వైఎస్పేరుకు ప్రాధాన్యం ఇచ్చినా.. తర్వాత తర్వాత.. తగ్గిస్తూ.. వచ్చారు. అయినప్పటికీ.. వైఎస్ ఇమేజ్‌తోనే జగన్ అధికారంలోకి వచ్చారు కనుక.. రేపు ఏదైనా జరిగి.. జగన్ కనుక.. జైలుకు వెళ్తే.. వైఎస్ వారసత్వంగా.. ఆయన సతీమణి అధికారంలోకి రావాలనేది.. వైఎస్ కుటుంబ సభ్యుల మాటగా వినిపిస్తోంది.
అంతేతప్ప.. జగన్ సతీమణి భార్యను వారు సీఎం వారసురాలిగా గుర్తించే అవకాశం కనిపించడం లేదు. వీరిలో వైవీ సుబ్బారెడ్డి సహా వైఎస్ వివేకానందరెడ్డి వర్గం కూడా ఉండడం గమనార్హం. దీంతో రేపు భారతిని కనుక సీఎం పీఠం ఎక్కిస్తే.. పార్టీలో చీలకలు వచ్చే అవకాశం మెండుగా ఉందని విజయమ్మ నాయకత్వానికి జై కొట్టే వైఎస్ వర్గం.. సీనియర్లు ఒక వైపు.. సీఎం జగన్ వైపు ఉండే యువ నేతలు మరో వైపు చీలిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక, ఇదే సమయంలో ఏపీపై బీజేపీ ప్రభావం కూడా ఉందని అంటున్నారు విశ్లేషకులు. బీజేపీ పెద్దల మద్దతు ఉన్నవారే ముఖ్యమంత్రి అవుతారని వారు విశ్వసిస్తున్నారు. తమిళనాడులో జయలలిత మరణానంతరం చోటుచేసుకున్న పరిణామాలను ఈ సందర్భంగా వారు ఉదహరిస్తున్నారు.
బీజేపీ పెద్దల అండ లభించడంతో పళనిస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి పదవి ఖాళీ అయితే ఆ పదవికి శ్రీమతి విజయలక్ష్మి, భారతీ రెడ్డి పోటీ పడితే బీజేపీ ఏ వైఖరి తీసుకోబోతోందన్నది కీలకం అవుతుంది. ఇలా ఏ విధంగా చూసుకున్నా.. జగన్ కనుక జైలుకు వెళ్తే.. పరిణామాలు మారడంతోపాటు..కుటుంబ కలహాలు కూడా తెరమీదికి వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.