ఇది కలికాలం…కొంతమందికి పోయేకాలం. అందుకే, వేలం వెర్రిగా ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అపుడెపుడో పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినట్టు కలియుగాంతంలో విచ్చలవిడితనం పెరిగిపోతుందంటే ఏమో అనుకున్నాం. కానీ, ప్రస్తుతం పాశ్చాత్య దేశాల్లో పోర్న్ కల్చర్….డ్రెస్ కల్చర్ చూస్తుంటే బ్రహ్మంగారు చెప్పిన యుగాంతం అతి దగ్గరలోనే ఉందని అనిపించక మానదు.
ఇక, తాజాగా అమెరికాలో ఆ పోయేకాలం దగ్గరపడిన కొందరు వ్యక్తులు తీసుకుంటున్న నిర్ణయాలు..యుగాంతానికి కచ్చితమైన ముందస్తు సూచనలని చెప్పేలా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అమెరికాలోని చికాగోలో ఐదు, ఆపై తరగతుల పిల్లలకు ఇక నుంచి తప్పనిసరిగా కండోమ్స్ సరఫరా చేయాలని చికాగో పబ్లిక్ స్కూల్స్ ఎడ్యుకేషన్ (సీపీఎస్) బోర్డు తీసుకువచ్చిన కొత్త పాలసీ పెనుదుమారం రేపుతోంది.
త్వరలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో బోర్డు పరిధిలోని 600 పాఠశాలల్లో ఈ కొత్త నిబంధనను అమలు చేయాలని సీపీఎస్ ఆదేశాలు కూడా జారీ చేసింది. అంతేకాదు, సెక్స్ ఎడ్యుకేషన్‌లో ఇది ఎంతో ఉపయోగకరమని సీపీఎస్ చెబుతోంది. ఎలిమెంటరీ పాఠశాలల్లో 250, హైస్కూళ్లలో 1000 వరకు కండోమ్‌లను చికాగో ఆరోగ్య శాఖ అందుబాటులో ఉంచుతుందని బోర్డు తెలిపింది.
అయితే, బోర్డు నిర్ణయం పట్ల చాలామంది పిల్లల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఐదో తరగతి విద్యార్థుల వయసు 10 నుంచి 11 సంవత్సరాలని, ఆ వయసులో వారికి కండోమ్స్ ఇవ్వడం దేనికి సంకేతమనిని వారు ప్రశ్నిస్తున్నారు. అసలు పిల్లలకు కండోమ్ ఇవ్వాలనే ఆలోచన బోర్డుకు రావడమే విడ్డూరమని, ఈ తరహో వింత పోకడలు పిల్లలపై దుష్ప్రభావం చూపే అవకాశముందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే బోర్డు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.