ఏపీ సీఎం జగన్ పాలనలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ అసంబద్ధ విధానాలను ప్రశ్నించిన టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఏపీలో ఉన్మాదిపాలన సాగుతోందని మండిపడ్డారు. నేడు గుంటూరులో పర్యటించిన చంద్రబాబు…టీడీపీ నేతల అక్రమ అరెస్టులపై ఏపీ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. చింతలపూడిలో ధూళిపాళ్ల నరేంద్ర ఇంటికి వెళ్లి పరామర్శించిన చంద్రబాబు అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘అన్నీ గుర్తు పెట్టుకుంటాం.. తర్వాత బదులు తీరిస్తాం’’ అని చంద్రబాబు హెచ్చరించారు. అధికార పార్టీకి పోలీసులు పావులుగా మారవద్దని, తాము ఇలా చేసుంటే వైసీపీ నేతలు ఒక్కరు కూడా ఉండేవారు కాదని అన్నారు. రాజకీయ కక్ష సాధింపు కోసమే నరేంద్రను అరెస్ట్ చేశారని, మచ్చలేని కుటుంబానికి చెందిన నరేంద్రను అరెస్టు చేయటం దుర్మార్గమని అన్నారు. పోలీసులు కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం ఏమిటని మండిపడ్డారు. తీవ్రవాదులను తీసుకెళ్లినట్లు నరేంద్రను అరెస్టు చేశారని, భవిష్యత్తులో ఓ రోజు వస్తుందని… ఆనాడు వైసీపీ నేతలకూ ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
అచ్చెన్నాయుడుతో మొదలైన అరెస్టులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని, కనీసం సాక్ష్యాలు లేకుండా అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. నరేంద్ర ఆస్తులు గతంలో ఎంత ఇప్పుడు ఎంతో చూడాలని, 2004కు ముందు జగన్ కుటుంబ ఆస్తులు, ఇప్పుడు ఆస్తులు చూడాలని సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో కామెంట్స్ పెడితే కూడా అరెస్టు చేస్తున్నారని, కోర్టు తీర్పులు కూడా పట్టించుకోవడం లేదని జగన్ సర్కార్ పై చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ హరిస్తున్నారని, ఒక ఉన్మాది పాలనలో పోలీసులు కూడా స్వేచ్ఛగా విధులు నిర్వహించే పరిస్థితి లేదని దుయ్యబట్టారు.