అగ్రరాజ్యం అమెరికాపై కరోనా మహమ్మారి పంజా విసిరిన సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు అమెరికా వంటి పెద్ద దేశం కూడా చిగురుటాకులా వణికిపోయింది. ఈ క్రమంలోనే కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వాయువేగంతో చేపట్టింది. ఇందులో భాగంగానే ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థల వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులిచ్చింది. అయితే, అన్ని దేశాలలో మాదిరిగానే అమెరికాలోనూ కొన్ని వ్యాక్సిన్లపై ప్రజలు అపోహపడుతున్నారు.
ఆ అపోహలకు తగ్గట్టుగానే తాజాగా సింగిల్ డోస్ గా అందుబాటులో ఉన్న జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌పై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో అరుదైన నాడీ వ్యాధులు వస్తున్నట్టు ఎఫ్‌డీఐ వెల్లడించింది. దాదాపు 100 మంది నుంచి ఈ తరహా ఫిర్యాదులు అందాయని ఎఫ్‌డీఐ అధికారులు షాకింగ్ అంశాలు బయటపెట్టారు.
జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ వేయించుకున్న వారి నరాల్లోని కణాలు దెబ్బతింటున్నాయని, కండరాల బలహీనత ఏర్పడి పక్షవాతం వచ్చే అవకాశం ఉందని ఎఫ్‌డీఐ తెలపడంతో అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. ఈ తరహా లక్షణాలను ‘గుల్లెయిర్ బార్ సిండ్రోమ్’ అంటారని, ఈ కేసులు 100 వరకు నమోదయ్యాయని ఎఫ్‌డీఐ తెలిపింది. ఈ వ్యాక్సిన్‌పై అమెరికన్ సీడీసీ వ్యాక్సిన్ ప్యానల్ మరోసారి సమీక్షను నిర్వహించాలని ఎఫ్‌డీఐ సూచించింది. అయితే, ఎఫ్‌డీఐ చేసిన వ్యాఖ్యలపై జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ ఇప్పటివరకు స్పందించలేదు.
మరోవైపు, రష్యా తయారుచేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ పై అర్జెంటీనా పరిశోధకులు పరిశోధనలు చేశారు. కరోనా నుంచి కోలుకున్న వారికి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఒకడోసు చాలని తేల్చి చెప్పారు. వారికి రెండో డోస్ వేసినా పెద్దగా ఉపయోగం ఉండదని వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్నాక స్పుత్నిక్ వీ సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకుంటే 94 శాతం ప్రభావం ఉంటుందని వారు తెలియజేశారు.