రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో విధించిన ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. కరోనాను నియంత్రించాలనే ఏకైక ఉద్దేశంతో ఏపీలోని జగన్ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. అయితే.. దీనికి సంబంధించి కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో.. సడలింపులు ఇస్తూ.. వచ్చారు. వాస్తవానికి.. మొదట్లో.. ఉదయం 6గంటల నుంచి 12 గంటల వరకు ఉన్న కర్ఫ్యూను సాయంత్రం 6 గంటల వరకు పెంచారు. తాజాగా.. కొన్ని రోజుల కిందట దీనికి సాయంత్రం 9గంటల వరకు పెంచారు. రెండు జిల్లాలు ఉభయగోదావరులు మినహా.. అన్ని జిల్లాల్లోనూ ఇదే తరహా.. అమలు చేస్తున్నారు.
ఇక, ఇప్పుడు తాజాగా మరోసారి.. ఈ కర్ఫ్యూ ను సడలించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకే విధంగా కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సడలింపు ఇచ్చారు. రాత్రి 9 గంటలకు దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మాస్క్ ధరించకపోతే రూ.100 జరిమానా కచ్చితంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ కఠినంగా అమలు చేయాలని అధికారులకు తెలిపారు. ప్రజలెవ్వరూ గుమిగూడకుండా కఠిన ఆంక్షలు విధించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
నిజానికి కర్ఫ్యూ విధింపు, సడలింపుల విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, తాజాగా ఇప్పటి వరకు లేని విధం గా రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ను బలంగా అమలు చేయాలని. ఎక్కడికక్కడ కేసులు నమోదు చేయాలని జగన్ ఆదేశించడం వెనుక చాలా వ్యూహమే కనిపిస్తోంది. నిజానికి ఇప్పటి వరకు మూడు సార్లు రాష్ట్రంలో కర్ఫ్యూను సడలించారు. ఆయా సందర్భాల్లో ఎప్పుడూ.. జగన్.. ఈ రేంజ్లో రాష్ట్రంలో 144 సెక్షన్ అమలుపై అరగంటపాటు చర్చించింది లేదు. కానీ, ఇప్పుడు మాత్రం నిశితంగా దీనిపై చర్చించడం.. అధికారులకు కేసులు పెట్టాలంటూ.. ఆదేశించడం వెనుక రాజకీయ కోణం ఉందని అంటున్నారు పరిశీలకులు.
ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ పాలనపై ప్రతిపక్షాలు ఉద్యమిస్తున్నాయి. విద్యార్థులు ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ కోసం వారు ఉద్యమిస్తున్నారు. మరోవైపు.. రైతులు.. జల వివాదంపై గళం వినిపిస్తూ.. ధర్నాలకు రెడీ అవుతున్నారు. ఇంకోపక్క, అమరావతి ఉద్యమం.. మళ్లీ తీవ్రతరం చేసేందుకు(ఎందుకంటే..కేంద్ర ప్రభుత్వం ఇటీవల మూడు రాజధానుల విషయంపై వ్యవహరించిన తీరుతో) సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ఉద్యమాల సెగ జగన్కు ఇప్పటికే బాగా తగులుతోంది. అలాగని ప్రజా ఉద్యమాలపై ఆయన కొరడా ఝళిపిస్తే.. మరింత వ్యతిరేకత వస్తుంది. ఈ నేపథ్యంలోనే కరోనా కర్ఫ్యూను అడ్డు పెట్టుకుని.. రాష్ట్రంలో ఉద్యమాలు, నిరసనలు, ధర్నాలు జరగకుండా.. జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారని అంటున్నారు పరిశీలకులు. 144 అస్త్రాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారని.. దీంతో తనపై వస్తున్న వ్యతిరేకతకు చెక్ పెట్టాలని అనుకుంటున్నారని అంటున్నారు పరిశీలకులు. మరి దీనిపై ప్రజాస్వామ్య వాదుల మాట ఏంటో చూడాలి.