భారతదేశ సినీ పరిశ్రమకు గర్వకారణమైన దర్శకుల్లో దిగ్గజ దర్శకుడు మణిరత్నం ఒకరు. రోటీన్ కు భిన్నంగా ఉండే సినిమాలు.. లోతైన ఆలోచనలతో పాటు.. సామాజిక అంశాల్ని ప్రస్తావిస్తూ. ..భావోద్వేగంతో సినిమాలు చేయటం ఆయన ప్రత్యేకత. మణిరత్నం నుంచి సినిమా వస్తుందంటే చాలు ఆసక్తిగా చూసేవాళ్లు ఎంతోమంది ఉంటారు. ఇప్పటికి భిన్నమైన.. విలక్షణమైన స్క్రీన్ ప్లే ఆయన సొంతం. అలాంటి మణిరత్నం.. ఏకంగా ఒక వెబ్ సిరీస్ చేస్తే? అంతకు మించిన ఆసక్తికర అంశం ఇంకేం ఉంటుంది?
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా పెద్ద దర్శకులు సైతం ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫాం వైపు చూస్తున్నారు. మరికొందరు అయితే.. వెబ్ సిరీస్ ల్ని తీయటం షురూ చేశారు. ఇలాంటివేళ.. మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకుడు ‘నవరస’ పేరుతో ఒక వెబ్ సిరీస్ చేయించారు. దీన్ని ఆగస్టు ఆరు నెట్ ప్లిక్స్ లో దీన్ని రిలీజ్ చేయనున్నారు. దీంతో.. ఈ సిరీస్ మీద విపరీతమైన ఆసక్తి వ్యక్తమవుతోంది.
మణిరత్నం లాంటి దర్శకుడు అసలు వెబ్ సిరీస్ ఎందుకు చేయాలనుకున్నారు? దాని వెనుక ఉన్న కథేంటి? అందుకు దారి తీసిన కారణాల్ని మణిరత్నం స్వయంగా వెల్లడించారు. కరోనా కారణంగా చితికిపోయిన వేలాది మంది సినీ కార్మికులకు అండగా నిలిచేందుకు ఏమైనా చేయాలన్న ఆలోచనలో పుట్టిందే తమ నవరసగా ఆయన చెప్పారు. అందుకే తాను.. జయేంద్ర కలిసి పలుసామాజిక కార్యక్రమాల్ని చేపట్టి నిధులు సేకరించామని.. ఇందులో భాగంగా తాను జయంత్ ను కలిసి.. వెబ్ సిరీస్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
నవరసాల్లోని తొమ్మిది రసాల (హాస్యం.. శృంగారం.. కరుణ.. శాంతం.. రౌద్రం.. బీభత్సం.. భయానకం.. అద్భుతం.. వీరం)తో ఒక్కో కథ చొప్పున మొత్తం తొమ్మిది రసాలతో తొమ్మిది కథల్ని సిద్ధం చేసి పూర్తి చేసినట్లుగా చెప్పారు. ఈ సిరీస్ లో భూమిక ట్రస్టు కీలక పాత్ర పోషించినట్లుచెప్పారు. కరోనాతో ఉపాధి కోల్పోయిన ఎంతోమందికి అండగా నిలిచేందుకు తామీ సీరిస్ చేసినట్లు చెప్పారు. రసానికి అనుగుణంగా ఏ దర్శకుడికి ఆ దర్శకుడు కథను సిద్ధం చేసుకున్నారని.. అవన్నీ వారికి తగ్గట్లుగా సాగుతాయని చెబుతున్నారు.
అయితే.. ఈ తొమ్మిది కథల్ని ఎంపిక చేయటం.. అవసరమైనప్పుడు తగిన మార్పులు చేయటం.. సలహాలు.. సూచనలు చేసినట్లు చెప్పారు. ప్రమాణాల్ని పర్యవేక్షించటం.. నిర్మాణాన్ని నడిపించటం చేశామన్నారు. తొమ్మిది కథల్ని తొమ్మిది మంది దర్శకులతోకలిసి.. ఎంతోమంది నటులతో ఈ ప్రమాణం చేసినట్లు మణిరత్నం చెప్పారు. ఈ వెబ్ సిరీస్ గురించి వివరాలు వింటేనే ఉత్సాహం కలుగుతుంది కదా. మరి.. వీటిని చూసేటప్పుడు కలిగే అనుభూతి మరెంత బాగుంటుందో కదూ?