అంతరిక్షంలో కాలు పెట్టబోతున్న తొలి తెలుగు అమ్మాయిగా శిరీష బండ్ల చరిత్ర సృష్టించనున్నారు అని నిన్నటి నుంచి వార్తలు మారుమోగుతున్న విషయం తెలిసిందే.
ఈ నెల 11వ తేదీన తెల్లవారు జామున ఈ స్పేస్‌క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్తుంది. శిరీష బండ్ల (sirisha bandla) అంతరిక్ష ప్రయాణానికి బయలుదేరనుంది. ఆరుగురు పరిశోధకులతో కూడిన బృందంలో శిరీష ఒకరు. టీమ్‌లో ఆమెతో పాటు ఇంకొక మహిళ ఉన్నారు.
అంతరిక్షంలో అడుగు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్న అపర కుబేరుడు.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు జెఫ్ బెజోస్ కంటే… మేథస్సుతో మన తెలుగమ్మాయి అంతరిక్షంలోకి ప్రవేశిస్తోంది.
‘వర్జిన్ స్పేస్ మిషన్’ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌కు రిచర్డ్ బ్రాస్నన్ సారథ్యం వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వర్జిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఈయన. వర్జిన్ గెలాక్టిక్, వర్జిన్ ఆర్బిట్.. వంటి స్పేస్ రీసెర్చ్ సంస్థలు ఈ గ్రూప్‌లో ఉన్నాయి.
ఇద్దరు పైలెట్లు, ముగ్గురు స్పేస్ స్పెషలిస్టులు, ఒక బిలియనీర్… వర్జిన్ గెలాక్టిక్ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా వారి ప్రయాణం సాగబోతోంది.
ఎవరీ శిరీష?
శిరీష బండ్ల సొంత ఊరు గుంటూరు జిల్లా తెనాలి. తెనాలి అలంకార్ ధియేటర్ యజమాని & మాజీ పురపాలక సంఘ చైర్మన్ బండ్ల పుల్లయ్య చౌదరి గారి మునిమనవరాలు. పుల్లయ్య చౌదరి సంతానం అమెరికాలో స్థిరపడింది.
శిరీష వర్జిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో కీలకమైన వర్జిన్ గెలాక్టిక్ సంస్థలో ప్రభుత్వ వ్యవహారాలను పర్యవేక్షించే విభాగానికి ఉపాధ్యక్షురాలు. అమెరికాలోని డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా పూర్వ విద్యార్థిని. మైక్రోగ్రావిటీ సబ్జెక్ట్‌లో నిష్ణాతురాలు.