అప్రయోజకరమైన కొన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా తనకు ఉన్న ప్లస్ లు ఉపయోగపడకుండా చేసుకోవడంలో తెలుగుదేశం పార్టీది అందెవేసిన చెయ్యి.
ఇది ఇపుడు ఎందుకు చెబుతున్నారా అని సందేహమా ?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలాన్ని కేంద్రం మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
మొన్న ఢిల్లీకి వెళ్లినపుడు ముఖ్యమంత్రి చేసుకున్న మనవిలో ఇది కూడా ఒకటి. జగన్ కోరికను మన్నించిన కేంద్రం ప్రస్తుతం సీఎస్ గా ఉన్న ఆదిత్య పదవీ కాలాన్ని పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.
దీంతో ఈ నెలాఖరున పదవీ విరమణ చేయాల్సిన ఆయన మరో మూడు నెలలు పదవిలో కొనసాగనున్నారు.
ఇక్కడ తెలుగుదేశం గురించి ప్రస్తావన ఎందుకంటే ఆయన పదవీ కాలాన్ని పొడగించ వద్దని కేంద్రానికి తెలుగుదేశం లేఖ రాసింది.
అసలు ఇలాంటి లేఖ రాయడం వల్ల అటు ప్రజా ప్రయోజనాలు నెరవేరవు. రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీకి ఉపయోగం లేదు.
అయినా తెలుగుదేశం పార్టీ లేఖరాసి అనవసరంగా తన ఖాతాలో ఒక అపజయాన్ని వేసుకుంది. చిన్న పాయింట్ దొరికే వైసీపీ నాయకులు దీనిని భూతద్దంలో పెట్టిచూపిస్తారు.
అంత అనుభవం జ్జానం ఉన్న తెలుగుదేశం పెద్దలు… కేంద్రానికి ఏ నొప్పి లేని సీఎస్ తాత్కాలిక పొడగింపును ఎందుకు అడ్డుకుంటారు అన్న చిన్న లాజిక్ ను మిస్సయ్యారు. పైగా వారికి అడిగినవన్నీ చేసిపెట్టిన జగన్ కు ప్రత్యేేక హోదాలు, పోలవరాలు ఎలాగూ ఇవ్వలేరు. ఇలాంటి మేళ్లు అన్నా చేస్తే మన జోలికి రాకుండా ఉంటారని బీజేపీ సర్కారు భావించడంలో ఆశ్చర్యం ఏం లేదు.
ఈ విషయాన్ని మరిచిపోయి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం పొడిగించవద్దంటూ కొద్ది రేజుల క్రితం టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీందర్ లేఖ రాయడం తెలివితక్కువ పనిగా పేర్కొనవచ్చు.
ఆ లేఖలో సీఎం జగన్‌పై సీబీఐ నమోదు చేసిన క్విడ్ ప్రో కో కేసులో ఆదిత్యానాథ్ కూడా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారని, జలవనరులశాఖ కార్యదర్శిగా జగన్ పెట్టుబడులు పెట్టిన ఇండియా సిమెంట్స్‌కు నీటిని కేటాయించడంలో అధికార పరిధిని అతిక్రమించి అనవసర సహాయ, సహాకారాలు అందించారని ఆరోపణలు చేశారు.
మరి జగన్ కి అంత క్లోజ్ ఉన్న వ్యక్తి కోసం జగన్ రెండడుగులు ముందుకు వేస్తారని తెలిసి ఎందుకు టీడీపీ ఇలా చేస్తుంది?