ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం తర్వాత తెలంగాణ టీపీసీసీ చీఫ్ గా ఉత్తమ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కొత్త టీపీసీసీ చీఫ్ నియామకం ఎపిసోడ్…బాహుబలిని కట్టప్ప చంపిన ఎపిసోడ్ కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగింది. మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి రూపంలో ఓ బలమైన నేత దొరికాడని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్న తరుణంలో వీహెచ్ సహా కొందరు సీనియర్ నేతలు రేవంత్ కు మోకాలడ్డుతున్నారని ప్రచారం జరిగింది. వారు అడ్డుపడకుంటే ఈ పాటికి రేవంత్ ను టీపీసీసీ చీఫ్ గా ప్రకటించేవారని అంతా అనుకున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఎట్టకేలకు టీపీసీసీ చీఫ్ ఎంపిక ఎపిసోడ్ కు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. అంతా అనుకుంటున్నట్టుగానే తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని ఏఐసీసీ ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఐదుగురుని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. అజారుద్దీన్, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, మహేశ్ కుమార్‌గౌడ్‌లను టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది.
టీపీసీసీ చీఫ్ ఎంపిక క్లైమాక్స్ కు చేరిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య రాజకీయాలు, వర్గపోరు బట్టబయలలైన సంగతి తెలిసిందే. ఉత్తమ్ రాజీనామా చేసిన రెండేళ్ల తర్వాత కూడా టీపీసీసీ చీఫ్ ఎంపిక చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ఉందని, అందుకే తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ల దృష్టిలో ఆ పార్టీ పలుచన అవుతోందని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా టీపీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డిని నియమించారు.