నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని, తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పట్టుబట్టి తెలంగాణా ప్రజలు తమ డిమాండ్ ను నెరవేర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇరు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ…జల జగడం మాత్రం ఓ కొలిక్కి రాలేదు. ఏపీ చేపట్టిన పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలపై తెలంగాణ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ట్రైబ్యునల్ పరిధిలో ఉండగా…ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
ఈ క్రమంలోనే దివంగత సీఎం వైఎస్ఆర్ పై తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసా వైఎస్ పై ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్న వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ ప్రజలకు దేవుడెలా అవుతారని ప్రశాంత్‌రెడ్డి నిలదీశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ పాలిట రాక్షసుడేనని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు.
జాతీయ హరిత ట్రైబ్యునల్ స్టే విధించినా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం ఆపడం లేదని మండిపడ్డారు.ఆ పథకాలతో రోజుకు 7.7 టీఎంసీల నీటి తరలింపునకు జగన్ కుట్ర పన్నారని మండిపడ్డారు. ఈ విషయమై అన్ని ఆధారాలతో ఫిబ్రవరిలోనే కృష్ణా బోర్డుకు సీఎం కేసీఆర్ లేఖ రాయడం వల్లే ప్రాజెక్టుల నిర్మాణం ఆపాలని ఏపీని ట్రైబ్యునల్ ఆదేశించిందన్నారు. సింహం లాంటి కేసీఆర్‌తో ఆటలాడుకోవడం మంచిది కాదని, అవసరమైతే మరో ఉద్యమానికి కూడా కేసీఆర్ సిద్ధమని అన్నారు.