ఏపీ సీఎం జగన్ కు, వైసీపీ నేతలకు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కొరకరాని కొయ్యగా మారిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ వరుస లేఖలతో జగన్ ను ముప్పు తిప్పలు పెడుతోన్న రఘురామ…తాజాగా జగన్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఆయనను ఇరకాటంలోకి నెట్టేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
ఇప్పటికే మండలిని రద్దు చేయాలంటూ జగన్ కు లేఖ రాసిన రఘురామ…తాజాగా మరో అడుగు ముందుకు వేశారు. ఏపీ శాసనమండలి రద్దుకు సహకరించాలని, ఆనాడు అసెంబ్లీలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని నెరవేర్చాలని కోరుతూ తాజాగా కేంద్రమంత్రులకు ఆర్ఆర్ఆర్ లేఖలు రాయడం చర్చనీయాంశమైంది. మండలిని రద్దు చేయాలంటూ కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రహ్లాద్ జోషికి రఘురామ రాసిన లేఖ హాట్ టాపిక్ గా మారింది.
మండలి రద్దు చేయాలంటూ ఏపీ అసెంబ్లీ కూడా తీర్మానం చేసిందని, గతంలో మండలి రద్దు తీర్మానం కాపీని కేంద్రానికి కూడా పంపారని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే మండలి రద్దుపై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. రాజుగారి వాలకం చూస్తుంటే మండలి రద్దు చేసే దాకా నిద్రపోయేలా లేరని, అనవసరంగా ఆయనపై రాజద్రోహం కేసు పెట్టి రెచ్చగొట్టారని నెటిజన్లు అంటున్నారు. జగన్ పరిస్థితి కక్కలేక…మింగలేక అన్న చందంగా ఉందని…ఈ పరిస్థితుల్లో రాజుగారి లేఖలు పుండు మీద కారం చల్లినట్టున్నాయని సెటైర్లు వేస్తున్నారు.