టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుకు నాగార్జున రెడ్డి అనే కేటుగాడు టోకరా వేసిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్లు ఇప్పిస్తానని చెప్పి సురేష్ బాబును నమ్మించిన నాగార్జున రెడ్డి…ఆ తర్వాత లక్ష రూపాయలు డబ్బులు ముట్టజెప్పగానే మొహం చాటేశాడు. దీంతో, తాను మోసపోయానని గ్రహించిన సురేష్ బాబు…పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ ప్రారంభించారు.
ఈ కేసును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే నాగార్జున రెడ్డి అసలు పేరు నాగేంద్ర బాబుగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు, ఇప్పటికే నాగేంద్రబాబుపై జంటనగరాల్లో ఆరు చీటింగ్ కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. సైబరాబాద్‌లో మూడు కేసులు, హైదరాబాద్‌లో రెండు కేసులు, విజయవాడలో ఒక కేసు నమోదైందని గుర్తించారు
అంతేకాదు.. గతంలో ఫిల్మ్ ఫేర్ అవార్డు ఇప్పిస్తానని కూడా నాగేంద్ర బాబు మోసాలకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. దీంతోపాటు, ఎయిర్ టెల్ ప్రైవేట్ నంబర్స్ ఇప్పిస్తానని కూడా నాగేంద్రబాబు పలు మోసాలకు పాల్పడినట్టు విచారణలో తేలింది. ఇక, తన దగ్గర 500 వ్యాక్సిన్లు ఉన్నాయని చెప్పిన నాగేంద్రబాబు…సురేష్‌బాబుని నమ్మించి లక్ష రూపాయలు ట్రాన్స్ ఫర్ చేయమని కోరాడు.
అతడిని నమ్మిన సురేష్ బాబు తన మేనేజర్‌కు చెప్పి డబ్బు ట్రాన్స్ఫర్ చేయించారు. డబ్బు అందిన తర్వాత నాగేంద్రబాబు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన సురేష్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.