జగన్ ఘనంగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై నిరుద్యోగుల తమ నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. ఇవి నిజంగానే కనీవినీ ఎరుగని ఖాళీలని…నెవర్ బిఫోర్ జాబ్ మేళా అని ఎద్దేవా చేస్తున్నారు. 2.3 లక్షల పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన జగన్…10 వేల పోస్టులే భర్తీ చేసి నిరుద్యోగులను నీరుగార్చారని అంటున్నారు. ఆ 10వేలలో ఐదు వేల పోస్టులు వైద్య ఆరోగ్య శాఖవేనని, మిగతా వాటిలో చాలా పోస్టులకు ప్రత్యేక అర్హతలు కావాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు.
గ్రూప్ 1, 2 సర్వీసులకు కలిపి 36 పోస్టులు ఇవ్వడం దారుణమని అంటున్నారు. ఇక, టీచర్, కానిస్టేబుల్ నియామకాల ఊసే లేదని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ హయాంలో 15 వేల టీచర్ పోస్టులు భర్తీకి జంబో డీఎస్సీ ఇచ్చారని, 2 విడతల్లో 6,748 పోలీసుల నియామకాలు జరిగాయని గుర్తు చేసుకుంటున్నారు. నిజంగా ఇది ఉద్యోగ ‘విప్లవం’ అంటూ చురకలంటిస్తున్నారు.
గతంలో ఏనాడూ ఇంత తక్కువ పోస్టులతో గ్రూప్-1,2 నోటిఫికేషన్లు రాలేదని, ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న జగన్….ఈ రేంజ్ లో భర్తీ చేస్తారని ఊహించలేదని వాపోతున్నారు. ఈ 10,143 ఖాళీలకు… దశల వారీగా 9 నెలల్లో నోటిఫికేషన్లు ఇస్తారని, మరి…మిగిలిన 2.20 లక్షల ఖాళీ పోస్టులు ఎన్నేళ్లలో భర్తీ చేస్తారోనంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
గ్రూప్ 1, 2 పోస్టులకు ఐదారు లక్షల మంది సిద్ధమవుతున్న నేపథ్యంలో 36 పోస్టులు ఏ మూలకొస్తాయని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో పది వేల పోస్టుల నోటిఫికేషన్ ఎడారిలో ఎండమావేనని అంటున్నారు. అందులో 15 లక్షల మంది వరకు సాధారణ డిగ్రీ, పీజీ చదువు పూర్తిచేసిన వారేనని, వారంతా గ్రూప్-1, 2, పోలీస్ రిక్రూట్మెంట్ల కోసం ఎదురుచూస్తున్నారని, వారి ఆశలపై జగన్ సర్కారు నీళ్లు చల్లిందని విమర్శలు వస్తున్నాయి.
గ్రూప్స్ కోసం ఇంటి నుంచి దూరంగా సంవత్సరాల నుంచి చదువుతున్న వారి పరిస్థితి దారుణంగా ఉందని అంటున్నారు. ఈ అరకొర పోస్టుల కోసం ప్రిపేర్ కాలేక, అటు కొత్త ఉద్యోగాలు దొరక్క, ఇటు ఇంటికి తిరిగి వెళ్లలేక నరకయాతన అనుభవిస్తున్నామని వాపోతున్నారు. 1956 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్క ముఖ్యమంత్రి ఇంతదారుణమైన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదని అభ్యర్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు.