టాలీవుడ్లోనే కాదు.. ఏ సినిమా రంగంలో అయినా మల్టీస్టారర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఇద్దరు టాప్ లేదా క్రేజీ హీరోలు కలిసి సినిమా చేస్తున్నారంటే ప్రేక్షకుల్లో ఆ సినిమా పట్ల ఉండే ఆతృత, ఆసక్తే వేరు. ఇక ఇప్పుడు పొలిటికల్ మల్టీస్టారర్లు కూడా వచ్చేస్తున్నాయి. ప్రజల్లో ఆదరణ ఉన్న రెండు పార్టీల నేతలు కలిసి పనిచేయడమే పొలిటికల్ మల్టీస్టారర్.
అయితే సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వచ్చినా సక్సెస్ అవుతారన్న గ్యారెంటీ లేదు. ఎన్టీఆర్, ఎమ్జీఆర్, జయలలితలా ఎవ్వరూ సక్సెస్ కాలేదు. తెలుగులో అన్నదమ్ములు అయిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ప్రజారాజ్యం, జనసేన పార్టీలతో ప్రజల ముందుకు వచ్చారు. వీరిని ఓటర్లు నమ్మలేదు. ఇదంతా గతం.. ఇప్పుడు ఏపీలో అదిరిపోయే పొలిటికల్ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమైంది.
ఏపీలో బలమైన కులాలుగా ఉన్న వాటిల్లో కమ్మలు టీడీపీకి, రెడ్లు వైసీపీకి బలమైన సపోర్టర్స్‌గా ఉన్నారు. కానీ సంఖ్యా పరంగా ఈ రెండు కులాల కంటే ఎక్కువుగా ఉన్న కాపు వర్గం గత నాలుగు దశాబ్దాలుగా తమ స్థాయికి తగిన విధంగా రాజకీయంగా ముందుకు వెళ్లలేకపోతోంది.
ఈ కులానికే చెందిన పవన్ కళ్యాణ్, చిరంజీవి పార్టీలు పెట్టినా సక్సెస్ కాలేకపోయారు. విచిత్రం ఏంటంటే వీరు ఎమ్మెల్యేగా కూడా తొలి ప్రయత్నంలోనే ఓడిపోయారు. చిరంజీవి ఓ చోట ఓడి మరోచోట నెగ్గినా, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా రెండు చోట్లా ఓడిపోయారు. కాపులు రాజకీయపరమైన గుర్తింపును ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.
అయితే ఇటీవల బీజేపీ మాత్రం కాపుల ప్రాధాన్యతా కోణంలో రాజకీయాలు చేస్తోంది. కాపు వర్గానికే చెందిన కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులకు ఏపీ బీజేపీ అధ్యక్ష పగ్గాలు కట్టబెట్టింది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ సమీకరణలు మారతాయన్న టాక్ ఉంది. జగన్‌ను గద్దె దించేందుకు బీజేపీ టీడీపీ, పవన్ లతో ఒక్కటైనా ఒక్కటవ్వవచ్చన్నదే రాజకీయ వర్గాల సారాంశం.
అయితే కాపుల ఓట్లను చీల్చేయాలన్నదే జగన్ టార్గెట్. అందుకే మెగాస్టార్ చిరంజీవిని తిరిగి రాజకీయాల్లోకి ఆహ్వానించడంతో పాటు ఆయన్ను రాజ్యసభకు పంపిస్తే… కాపులనే కాకుండా పవన్ కళ్యాణ్ ను సైతం టీడీపీకి దగ్గర కాకుండా చేయాలన్నదే జగన్ ప్లాన్ అని వైసీపీ వాళ్లలో తాజాగా వినిపిస్తోన్న టాక్.
అలాగే బీజేపీ పవన్‌ను ముందు పెట్టుకుని కాపు ఓట్లను తమ వైపునకు తిప్పుకునే ప్లాన్‌లో కూడా ఉంది. ఈ ప్రయత్నాలను పూర్తిగా అడ్డుకోవడం లేదా చిరును రాజ్యసభకు పంపి.. కాపుల్లో కొంత వరకు చీలిక తేవడం ద్వారా మళ్లీ అధికారంలోకి రావాలన్నదే జగన్ & కో ప్లాన్ అట. మరి ఈ పొలిటికల్ కాంబినేషన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో ? చూడాలి.