విజయనగరం జిల్లా మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ఏపీలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తోసిపుచ్చుతూ.. హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. విజయనగరం గజపతి వంశీయులకు చెందిన మాన్సాస్ ట్రస్టు, సింహాచలం ఆలయ ట్రస్టుల చైర్మన్‌గా ఉన్న టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజును రాత్రికిరాత్రి మారుస్తూ.. సీఎం జగన్ జీవో 72ను తీసుకువచ్చారు.
ఈ క్రమంలో అశోక్ గజపతిరాజు సోదరుడు దివంగత ఆనందగజపతి రాజు కుమార్తె సంచయిత ను నియమించారు.అప్పట్లో తీవ్ర వివాదాలకు దారితీసిన ఈ వ్యవహారం.. రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. జగన్ ఇచ్చిన జీవోను అడ్డు పెట్టుకుని రాత్రికిరాత్రి ఢిల్లీ నుంచి వచ్చిన సంచయిత సింహాచలం దేవస్థానం చైర్మన్‌గా, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.
దీంతో ఈ వివాదంపై అశోక్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై పలు దఫాలుగా విచారణ జరిపిన హైకోర్టు.. కొన్నాళ్ల కిందటే.. అశోక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. ఉత్తర్వులు ఇచ్చింది.దీంతో మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్‌గా అశోక్ గజపతిరాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. అయితే.. ఆయనకు పరాభవం ఎదురైంది. గజపతిరాజు బాధ్యతల స్వీకరణ సమయంలో మాన్సస్ ఈవో, కరస్పాండెంట్ తదితర అధికారులు పత్తాలేకుండా పోయారు.