ఏపీ సీఎం జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వరుస లేఖలతో బెంబేలెత్తిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రజలకు జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని గుర్తు చేస్తున్న రఘురామ…సైలెంట్ గా జగన్ ను ఇరకాటంలో పడేస్తున్నారు. ప్రజలు మెల్లగా మరచిపోతున్న జగనన్న హామీలను గుర్తు చేస్తూ….జగన్ సర్కార్ కు కొరకరాని కొయ్యగా మారారు. గత ఆరు రోజులుగా వరుసగా లేఖలు రాస్తూ జగన్ ను ముప్పు తిప్పలు పెడుతున్న ఆర్ఆర్ఆర్…తాజాగా ఏడో లేఖను సంధించారు. రైతులకు జగన్ ఇచ్చిన హామీని తక్షణమే నిలబెట్టుకోవాలని కోరుతూ రఘురామ లేఖ రాశారు.
రైతు భరోసా అంశాన్ని లేఖలో ప్రస్తావించిన రఘురామ…ఎన్నికల ప్రచారంలో రైతులకు జగన్ హామీ ఇచ్చారని, అందుకే పార్టీకి రైతన్నలంతా భారీ సంఖ్యలో అండగా నిలిచారని రఘురామ గుర్తు చేశారు. రైతు భరోసాను రూ.12,500 నుంచి రూ. 13,500లకు పెంచుతామని జగన్ ఇచ్చిన హామీని తక్షణమే నిలబెట్టుకోవాలని ఆర్ఆర్ఆర్ డిమాండ్ చేశారు. ఏపీ సర్కార్ ఇచ్చే రూ.13,500 లకు కేంద్రం ఇచ్చే రూ. 6వేలు కలిపి మొత్తం రూ.19,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో జీరో వడ్డీతో లోన్లు ఇస్తామని ఇచ్చిన హామీని జగన్ ఇంతవరకు నెరవేర్చలేదని విమర్శించారు. ట్రాక్టర్లకు సబ్సిడీ, రోడ్ టాక్స్ మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చారని, అది ఇంకా నెరవేర్చలేదని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో జగన్ పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే జగన్…ఇలా రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో మాత్రం మీనమేషాలు లెక్కించడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని గుర్తు చేస్తున్న రఘురామపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ఏమిటని నిలదీస్తున్నారు.