ఏంటో ఈ మధ్య.. తమిళంలో పేరున్న దర్శకులు, హీరోలు ఉన్నట్లుండి టాలీవుడ్ వైపు చూస్తున్నారు. తమ సినిమాల డబ్బింగ్ వెర్షన్ల ప్రమోషన్ల కోసం ఇక్కడికి వచ్చినపుడు నేరుగా తెలుగులో సినిమా చేస్తాం అనడమే తప్ప.. ఆ దిశగా వాళ్లు సీరియస్‌గా దృష్టిపెట్టిన సందర్భాలు అరుదు.
ఐతే ఇప్పటిదాకా తెలుగులో సినిమానే చేయని శంకర్.. రామ్ చరణ్‌తో సినిమా చేయడానికి ముందుకు రావడం.. అలాగే లింగుస్వామి రామ్ హీరోగా ఓ సినిమా మొదలుపెట్టడం.. మరో అగ్ర దర్శకుడు మురుగదాస్ సైతం తెలుగులోనే సినిమా చేసే అవకాశాలు కనిపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. తమిళ స్టార్ హీరోలు కూడా ఇదే బాట పడుతుండటం విశేషం. గత కొన్నేళ్లలో తెలుగులో ఫాలోయింగ్ పెంచుకున్న విజయ్.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఓ సినిమా చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మరో స్టార్ హీరో సూర్య సైతం తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయడానికి రెడీ అయినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అతను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో జట్టు కట్టనున్నాడట. ఓవైపు వైవిధ్యమైన సినిమాలు చేస్తూనే.. మధ్య మధ్యలో మాస్ సినిమాలు ట్రై చేస్తుంటాడు సూర్య.
హరితో కలిసి చేసిన సింగం తరహా చిత్రాలు అందుకు ఉదాహరణ. తెలుగులో నేరుగా సినిమా చేస్తానని ఎప్పట్నుంచో చెబుతున్న సూర్య.. ఎట్టకేలకు బోయపాటి దర్శకత్వంలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడట. విజయ్-వంశీ పైడిపల్లి, శంకర్-రామ్ చరణ్ చిత్రాలను ప్రొడ్యూస్ చేయనున్న దిల్ రాజే ఈ సినిమాను కూడా నిర్మిస్తాడని అంటున్నారు.
అఖండ తర్వాత అల్లు అర్జున్‌తో బోయపాటి ఓ సినిమా చేయాలనుకున్నప్పటికీ.. అది వెంటనే పట్టాలెక్కేలా లేదు. ఈ లోపు ఆయన సూర్య కోసం కథ రెడీ చేసి అతణ్ని ఒప్పించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన వస్తుందట.