ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ నేతలు కారాలు, మిరియాలు నూరిన సంగతి తెలసిందే. నిమ్మగడ్డకు కులం రంగు ఆపాదించడమే కాకుండా నిమ్మగడ్డ వ్యవహారానికి రాజకీయ రంగు పులిమి ప్రభుత్వ పెద్దలంతా నానా యాగీ చేశారు. రాజ్యాంగబద్ధంగా తన పదవీకాలం కాపాడుకునేందుకు నిమ్మగడ్డ సుప్రీం తలుపు తట్టాల్సి వచ్చింది. ఎట్టకేలకు సుప్రీం అక్షింతలు వేయడంతో చివరకు నిమ్మగడ్డనే ఎస్ఈసీగా కొనసాగించిన జగన్ సర్కార్….చివరకు నిమ్మగడ్డనే జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని బ్రతిమిలాడింది.
అయితే, రాజ్యాంగ విలువలకు కట్టుబడ్డ నిమ్మగడ్డ…తాను పదవీ విరమణ చేస్తున్నానని, ఎన్నికలు నిర్వహించడం కుదరదని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తమకు అనుకూలంగా ఉండే ఏపీ మాజీ సీఎస్ నీలం సాహ్నిని ఏపీ సర్కార్ ఆఘమేఘాల మీద కొత్త ఎస్ఈసీగా నియమించింది. అయితే, కేవలం జగన్ సర్కార్ మెప్పు పొందడమే లక్ష్యంగా నీలం సాహ్ని….యుద్ధ ప్రాతిపదికన జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడం, ఎన్నికలు నిర్వహించడం, ఆ ఎన్నికలను హైకోర్టు రద్దు చేయడం జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే సాహ్ని నియామకంపై హైకోర్టు కూడా అనుమానాలు లేవనెత్తింది.
ఈ క్రమంలోనే సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం నీలం సాహ్నీకి షాకిచ్చింది. నీలం సాహ్నికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ సర్కారుకు, ఇతర ప్రతివాదులకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగవ్యతిరేకంగా వ్యవహరిస్తే ఇలాగే కోర్టులతో మొట్టికాయలు తప్పవని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలోనూ కేవలం కక్ష సాధింపు కోసమే అశోక్ గజపతి రాజును తొలగించారని నెటిజన్లు మండిపడుతున్నారు.