కొన్ని రోజులుగా వివాదంగా మారిన కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం బాధ్యతలపై మంత్రి వెలంపల్లి తాజాగా స్పందించారు. బ్రహ్మంగారి మఠాధిపతులుగా 11 మంది పనిచేశారని.. మఠాధిపత్యంపై ఎలాంటి వీలునామా తమకు అందలేదని శ్రీనివాస్ అన్నారు. బ్రహ్మంగారి మఠం వివాదంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివాదాన్ని పరిష్కరించేందుకు సమాలోచనలు జరిపారు.
నిబంధనల ప్రకారం 90 రోజుల్లో వీలునామా అందించాలని.. వీలునామా అందనందున ధార్మిక పరిషత్ తదుపరి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మఠం నిర్వహణకు తాత్కాలిక అధికారిని నియమించామని ఆయన చెప్పారు.
మఠం ఆచారాలు, సంప్రదాయాలను త్వరితగతిన సేకరిస్తామని పేర్కొన్నారు. మఠాధిపతులు, పీఠాధిపతులు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వొచ్చని సూచించారు. బ్రహ్మంగారి పీఠాధిపతి ఎంపిక సాంప్రదాయబద్ధంగా జరుగుతుందని మంత్రి వెల్లంపల్లి వెల్లడించారు.
అయితే.. మంత్రి వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. బ్రహ్మంగారి మఠం ప్రభుత్వ ఆధీనంలో ఉందా? లేదో చెప్పాలనే ప్రశ్నలు వస్తున్నాయి. అదేసమయంలో ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం జోక్యం సమంజసమేనా? అనేది కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే దివంగత మఠాధిపతి సతీమణి.. డీజీపికి కూడా లేఖ రాసిన నేపథ్యంలో.. ఇప్పుడు నేరుగా ప్రభుత్వం జోక్యం చేసుకుని తామే బాధ్యులమన్నట్టు వ్యాఖ్యలు చేయడాన్ని పలువురు ఆక్షేపిస్తుండడం గమనార్హం. గతంలోనూ పలు ఆలయాలకు సంబంధించి వెల్లంపల్లి ఇలానే రాజకీయాలు చేశారని అంటున్నారు.