సంచలన పరిణామాలతో మంత్రి పదవి కోల్పోయింది మొదలుకొని టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే వరకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అయితే, అనంతరం కూడా అదే స్థాయిలో ఆయన మీడియాలో ఉన్నారు.
దానికి కారణం ఒకటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించకపోవడం మరొకటి బీజేపీలో ఎప్పుడు చేరనున్నారో ఇటు ఈటల రాజేందర్ కానీ…అటు కాషాయ పార్టీ కానీ ప్రకటించకపోవడం.
అయితే, ఎట్టకేలకు ఈ సస్పెన్స్ వీడిపోయింది.బీజేపీలో చేరేందుకు ఇప్పటికే గ్రౌండ్ సిద్ధం చేసుకన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ కండువా కప్పుకొనే తేదీ ఖరారైంది. ఈ నెల 14వ తేదీన ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నారు.
ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల రాజేందర్ కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈటల రాజేందర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, పలువురు టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి నేతలు కూడా బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు.