బెల్లం చుట్టూ ఈగలు ముసరటం మామూలే. ఇదే విషయం తాజాగా రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల విషయం చెప్పేస్తోంది. కేంద్రంతో పాటు.. దేశంలోని పలు రాష్ట్రాల్లో పవర్ లో ఉన్న బీజేపీకి విరాళాల వరద పారుతున్న వైనం తాజాగా వెల్లడైన నివేదిక స్పష్టం చేస్తోంది. మిగిలిన పార్టీలకు అందనంత దూరంలో ఈ విరాళాల లెక్క ఉండటం గమనార్హం. 2019-2020 ఏడాదికి సంబంధించి దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలకు సంబంధించిన వివరాల్ని తాజాగా వెల్లడించారు. వాస్తవానికి ఈ లెక్కలకు సంబంధించిన సమాచారాన్ని బీజేపీ ఫిబ్రవరిలోనే ఎన్నికల సంఘానికి చెప్పినప్పటికీ.. తాజాగా ఆ వివరాల్ని వెల్లడించారు.
చెక్ లేదంటే బ్యాంక్ ట్రాన్స్ ఫర్ ద్వారా రూ.20వేలు.. అంతకంటే ఎక్కువ విరాళాల లెక్కను మాత్రమే చెబుతారు. ఈ లెక్కన బీజేపీకి ఏడాదిలో రూ.217.75 కోట్ల విరాళాలు వచ్చాయి. అవన్నీ ఫ్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్టు నుంచి రావటం గమనార్హం. అదే సమయంలో బీజేపీకి జన్కల్యాణ్ ఎలక్టోరల్ ట్రస్టు నుంచి మరో రూ.45.95 కోట్లు అందాయి. ఏబీ జనరల్ ఎలక్ట్రోలర్ ట్రస్టు నుంచి రూ.9కోట్లు.. సమాజ్ ఎలక్ట్రోరల్ ట్రస్టు నుంచి రూ.3.75 కోట్లు అందాయి.
బీజేపీకి వచ్చిన విరాళాలతో పోలిస్తే.. కాంగ్రెస్ కు చాలా తక్కువగా విరాళాలు అందటం గమనార్హం.
ఆ పార్టీకి రూ.139.01 కోట్ల విరాళాలుగా అందాయి. బీజేపీకి బద్ధ శత్రువైన మమత అధ్యక్షరాలుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ రూ.8.08 కోట్లు అందాయి. కమ్యునిస్టు పార్టీలో సీపీఎంకురూ.19.69 కోట్లు విరాళాలుగా రాగా.. సీపీఐకు మాత్రం కేవలం రూ.1.29 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక.. మహారాష్ట్ర అధికారంలో ఉన్న మిత్రపక్షమైన ఎన్సీపీకి రూ.59.94 కోట్లు రావటం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తు అయితే మాయావతి అధ్యక్షురాలిగా ఉన్న బహుజన సమాజ్ పార్టీకి మాత్రం ఎలాంటి విరాళాలు రానట్లు చెబుతున్నారు. ఒకప్పుడు యూపీని ఏలిన ఈ పార్టీకి ఇలాంటి పరిస్థితా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది.