బహుశ రెండు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఒకే పార్టీలో ముగ్గురు మహిళలు.. ఒకే జిల్లా నుంచి గెలుపు గుర్రాలు ఎక్కారు. అది కూడా వైసీపీ నుంచే. వారిలోనూ ఇద్దరు ఎస్సీ వర్గానికి చెందిన వారు. మరొకరు బీసీ వర్గానికి చెందిన మహిళ. పైగా వీరిలో ఒకరు మంత్రి కూడా! దీంతో వీరి నుంచి పార్టీ చాలానే ఎక్స్పెక్ట్ చేసింది. అదేసమయంలో జిల్లా ప్రజలు కూడా చాలానే ఎక్స్పెక్ట్ చేశారు.
జిల్లా సమస్యలు తీరతాయని, ముఖ్యంగా మహిళల అభ్యున్నతికి జిల్లాలో అనేక కార్యక్రమాలు ఏర్పాటు అవుతాయని.. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని అనుకున్నారు. కానీ, ఏడాదిన్నర గడిచింది. ఈ మహిళా నాయకురాళ్లు ఎవరిదారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
వారే.. గుంటూరు జిల్లాకు చెందిన ప్రత్తిపాడుఎమ్మెల్యే కం మంత్రి మేకతోటి సుచరిత, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని, తాడికొండకు చెందిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. నిజానికి ఒక జిల్లాలో ముగ్గురు మహిళలు గెలుపు గుర్రం ఎక్కిన హిస్టరీ ఎక్కడా లేదు. అసలు ఇలా ఒక పార్టీ ఒక జిల్లాలో ముగ్గురు మహిళలకు టికెట్లు కూడా ఇవ్వడం అరుదు.
అలాంటిది వీరు ఎంత కలివిడి రాజకీయాలు చేయాలి? పార్టీకి ఎంత పేరు తీసుకురావాలి? పోనీ.. జిల్లాలో ఎన్నడూ లభించనిఅవకాశం తమకు లభించింది కాబట్టి.. మహిళలకైనా ఏదైనా చేయాలి కదా? కానీ, వీరు మాత్రం ఒక్క వేదికపై ఏనాడూ కనిపించరు. ఒక్కమాటపై ఏనాడూ నిలబడరు!
ఎవరి వ్యూహాలు వారివి. ఎవరి రాజకీయాలు వారివి. మంత్రి సుచరిత.. తన నియోజకవర్గాన్నే పట్టించుకోవడం లేదనే ఆరోపణలు గడిచిన ఆరు మాసాలుగా భారీగా వినిపిస్తున్నాయి. ఇక, ఆమె ఎవరితో మాత్రం కలిసి రాజకీయాలు చేస్తారు? అంటున్నారు వైసీపీ సీనియర్లు. ఇక, రజనీ.. తన నియోజకవర్గంలో తానే సర్వం.. అన్నట్టుగా వ్యవహరిస్తారట. పైగా ఎవరితో మాట్లాడినా.. తనకేంటి? అనే శైలిని అవలంబిస్తున్నట్టు కూడా విమర్శలు వస్తున్నాయి.
ఇక, ఉండవల్లి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఇటీవల కాలంలో వివాదాల్లో తీరిక లేకుండా మునిగితేలుతున్నారు. దీంతో ముగ్గురు మహిళా నాయకురాళ్లు ఉన్నప్పటికీ. జిల్లాలో మహిళలకు ఉపాధి పెరగడం లేదు. విద్య పెరగడం లేదు. ఆర్థికంగా చేయూతలభించడం లేదు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. మంత్రి సుచరిత.. ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే వనితతో స్నేహం.. కురుపాం ఎమ్మెల్యే కం మంత్రి పుష్ప శ్రీవాణితో నేస్తం.. తప్ప.. స్థానికంగా మాత్రం ఆమె ఎవరితోనూ కలివిడిగా లేరనే టాక్ వినిపిస్తోంది. ఇదీ.. సంగతి..!!