వ్యాక్సినేషన్ విషయంలో నరేంద్రమోడి సర్కార్ పై జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి పెంచగలరా ? ఇపుడిదే అంశం అనుమానంగా మారింది. రాష్ట్రావసరాలకు సరిపడా కేంద్రం టీకాలను సరఫరా చేయటం లేదన్నది వాస్తవం. టీకాల కార్యక్రమంలో కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా దేశమంతా అస్తవ్యస్ధంగా తయారైంది. ఈ విషయంలో కేంద్రాన్ని సుప్రింకోర్టు కూడా తీవ్రంగా తప్పు పట్టిన విషయం తెలిసిందే.
ఈ నేపధ్యంలోనే అవసరమైనన్ని టీకాల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని జగన్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తాజాగా ఓ లేఖ రాశారు. అందరికీ టీకాలను వేయించే బాధ్యత కేంద్రంపైనే ఉందని చెప్పారు. కేంద్రీకృత, సమన్వయ విధానం ద్వారా మాత్రమే అందరికీ టీకాలు వేయించే కార్యక్రమం విజయవంతమవుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. కాబట్టి టీకాల కార్యక్రమం సజావుగా సాగాలంటే కేంద్రంపై కలిసికట్టుగా ఒత్తిడి తేవాలని జగన్ సహచర సీఎంలకు విజ్ఞప్తి చేశారు.
పిలుపువరకు బాగానే ఉంది కానీ ఆచరణలోకి వచ్చేసరికి కేంద్రానికి వ్యతిరేకంగా జగన్ నిలబడగలరా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే తన వ్యక్తిగత అవసరాల కోసం కేంద్రానికి వ్యతిరేకంగా జగన్ ఇంతవరకు ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. పైగా కేంద్రం చేస్తున్న ప్రతీ చట్టానికి పార్లమెంటులో మద్దతిస్తున్నారు. నిజానికి టీకాల కార్యక్రమంలో కానీ ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా విషయంలో రాష్ట్రానికి కేంద్రం మొదటినుండి అన్యాయమే చేస్తోంది. అయినా మోడిని గట్టిగా నిలదీయలేకపోయారు.
అలాంటిది హఠాత్తుగా కేంద్రవైఖరికి నిరసనగా ఇతర ముఖ్యమంత్రులకు లేఖలు రాయటం ఆశ్చర్యంగా ఉంది. టీకాలపై కేంద్రానికి ఇప్పటికే మమతా బెనర్జీ, హేమంత్ సోరేన్, పినరయి విజయన్, నవీన్ పట్నాయక్, కేజ్రీవాల్ లేఖలు రాసిన విషయం అందరికీ తెలిసిందే. పై ముఖ్యమంత్రులందరు అవసరమైతే కేంద్రంతో ఎంత గట్టిగా అయినా ఉండగలరు ? మరి జగన్ అంత గట్టిగా ఉండగలరా ?