కొద్ది నెలల క్రితం దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అనూహ్య విజయంతో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం వచ్చిన సంగతి తెలిసిందే. దుబ్బాక గెలుపు ఇచ్చిన కిక్ తో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ అధికార టీఆర్ ఎస్ కు బీజేపీ గట్టిపోటీనిచ్చింది. ఈ నేపథ్యంలోనే కొంతకాలంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండ్ ఫ్యామిలీపై కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.
ఎన్ని యాగాలు చేసినా కేసీఆర్ చేసిన పాపాలు పోవని, తెలంగాణకు పట్టిన వాస్తుదోషం కేసీఆర్ అని, కేసీఆర్ ను ఇంటికి సాగనంపితేనే రాష్ట్రం బాగుపడుతుందని గతంలో బండి సంజయ్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా కేసీఆర్ పై సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, కేసీఆర్ ను ఎప్పుడు జైలుకు పంపించాలన్న వ్యూహరచన చేస్తున్నామని అన్నారు.
2023లో టీఆర్ఎస్ ను సమాధి చేస్తామని బండి సంజయ్ శపథం చేశారు. అమరుల కుటుంబాలను న్యాయం చేసే ఆలోచన కేసీఆర్కు లేదని మండిపడ్డారు. కేసీఆర్పై పోరాటానికి అన్నివర్గాలు, ఉద్యమకారులు బీజేపీతో కలసి రావాలని పిలుపునిచ్చారు.అమరవీరుల త్యాగల ఫలితమే తెలంగాణ అని ఆయన అన్నారు. రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ, సుష్మాస్వరాజ్ పాత్ర కీలకమని చెప్పుకొచ్చారు.
టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి చిట్టా తమ దగ్గరుందని, 18 మంది ముఖ్యనేతలపై లీగల్ ఒపీనియన్ తీసుకున్నామని బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ సహారా, ఈఎస్ఐ కేసుల వివరాలపై ఆరా తీస్తున్నామని, ఈ స్కాంలు చూశాకే సీఎం కేసీఆర్ ఎంత పెద్ద అవినీతిపరుడో తేలిపోయిందని ఎద్దేవా చేశారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ వారం రోజుల్లో బీజేపీలో చేరతారని, పదవికి, పార్టీకి రాజీనామా చేయడంలో లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారని వెల్లడించారు. ఎలాంటి హామీ లేకుండానే ఈటల బీజేపీలో చేరుతున్నారని, బీజేపీలో ఎవరు చేరినా.. ఎలాంటి హామీ ఉండదని అన్నారు. బీజేపీ సిద్ధాంతాలు, ప్రధాని మోదీ పాలన నచ్చి ఈటల బీజేపీలో చేరుతున్నారని అన్నారు. కేసీఆర్ వ్యతిరేకులకు, ఉద్యమకారులకు బీజేపీ మంచి వేదిక అని అన్నారు.