గలగల పారే గోదారి ఎంత సొగసుతో ఉంటుందో.. వానా కాలంలో అందుకు భిన్నంగా మహోగ్ర రూపంలో ప్రవహించే గోదారిని చూస్తే ఒళ్లు గగుర్పాటే. సహజసిద్ధంగా సాగే.. గోదారి ప్రవాహాన్ని దారి మళ్లించటం.. అది కూడా 6.5 కి.మీ కావటం.. గమనార్హం.
ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులు జగన్ వచ్చాక నత్తనడకన సాగుతున్నాయి. ఏడాది క్రితం జరగాల్సిన ఒక కీలకమైన పని ఈరోజు జరుగుతోంది.
వర్షాకాలం మొదలవుతుందంటే చాలు.. వరద పోటుతో ప్రాజెక్టు పనులకు ఆటంకాలు ఏర్పడే పరిస్థితి. ఈ నేపథ్యంలో వరద నీటిని మళ్లించేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ కొత్త విధానాన్ని చేపట్టింది.
ఇందులో బాగంగా ఎగువ కాఫర్ డ్యాం నుంచి గోదావరి నీటిని మళ్లించే కార్యక్రమాన్ని చేపట్టింది. గోదావరి ప్రవాహాన్ని ఎడమ నుంచి కుడివైపునకు మళ్లించే పనుల్ని చేపట్టారు ఇంజనీర్లు. ఇదో కీలక ఘట్టం అనే చెప్పాలి.
అప్రోచ్ ఛానల్ నుంచి స్పిల్ వే మీదుగా మళ్లే గోదారి జలాలు స్పిల్ చానల్ నుంచి మరలా పైలెట్ ఛానల్ వద్ద సహజ ప్రవాహంలోకి కలవనున్నాయి.
ఇప్పటికే 14 రేడియల్ గేట్లను పైకి ఎత్తి సిద్ధంగా ఉంచి అధికారులు.. మిగిలిన గేట్లను ఎత్తి ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాజెక్టులో కీలకమైన ఎగువ.. దిగువ కాపర్ డ్యాం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.