సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర, ఎండీ గోపాలకృష్ణన్లను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, బెయిల్ కోసం వారి తరఫున న్యాయవాదులు వేసిన పిటిషన్లను విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. దీంతో, వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వారికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా…తాజాగా ధూళిపాళ్ల నరేంద్ర , గోపాల కృష్ణన్ లు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు, ధూళిపాళ్ల నరేంద్రను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రేపు పరామర్శించనున్నారు.
అంతకుముందు ధూళిపాళ్ల నరేంద్ర, గోపాలకృష్ణన్లకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పిటిషనర్లు కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నందున బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది. విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషనర్లు ఇద్దరూ రూ.లక్ష చొప్పున రెండు పూచికత్తులు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
దీంతోపాటు, బెయిల్పై విడుదలైన తేదీ నుంచి 4 వారాల పాటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి దాటి బయటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. పిటిషనర్లు నివాసం ఉండే చిరునామాను ఏసీబీ అధికారులకు ఇవ్వాలని సూచించింది. దర్యాప్తులో భాగంగా పిటిషనర్లను విచారణ జరపాలని అధికారులు భావిస్తే 24 గంటల ముందు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దని, దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్లను ఆదేశించింది.