ప్రపంచంలోని పలు దేశాలపై కరోనా సెకండ్ వేవ్ సునామీలాగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సెకండ్ వేవ్ ను లైట్ తీసుకున్న భారత్ పై కరోనా పంజా విసిరింది. దీంతో, రోజుకు దాదాపు 4లక్షల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. ఓ దశలో 5 లక్షల మార్క్ కూడా దాటుతుందని నిపుణులు అంచనా వేశారు. అయితే, సరైన సమయంలో రాష్ట్రాలు లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ వంటి చర్యలు చేపట్టడంతో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే కరోనా కేసుల సంఖ్య 2 లక్షల కన్నా తక్కువగా నమోదు కావడం ఊరట కలిగిస్తోంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,96,427 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇదే తరహాలో మరో రెండు వారాలపాటు లాక్ డౌన్లు కంటిన్యూ చేయడంతో పాటు ప్రజలంతా కోవిడ్-19 నిబంధనలు కచ్చితంగా పాటిస్తే కేసుల సంఖ్యలో గణనీయమైన మార్పులుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అంతకుముందే, జూన్ 15 నాటికి కరోనా కేసులు తగ్గుముఖం పడతాయని నిపుణులు అంచనా వేసిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా ఫస్ట్ వేవ్ వల్ల అనివార్యమైన లాక్ డౌన్ వల్ల కుదేలైన ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడింది. దీంతో, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా సకాలంలో లాక్ డౌన్ విధించడం వంటి చర్యలు సత్ఫలితాలనిచ్చాయని చెప్పవచ్చు. ఇదే తరహాలో మరో రెండు, మూడు వారాలు అందరం కలిసికట్టుగా పోరాడితే భారత్ లో కరోనా కిరీటం కకావికలమై తోక ముడుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.