కరోనా తొలి వేవ్ లో ప్రాణాలకు తెగించి వైద్య సేవలందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి అవసరమైన పీపీఈ కిట్లు, ఫేస్ మాస్కులేవంటూ ప్రశ్నించిన పాపానికి కేసులపాలై, పిచ్చోడిగా ముద్ర వేయించుకుని ఇటీవలే గుండెపోటుతో మరణించిన డాక్టర్ సుధాకర్ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తనదైన శైలిలో స్పందించారు.
ప్రభుత్వ దమన నీతిని ప్రశ్నిస్తూ… సోమవారం ఉదయం విశాఖ వచ్చిన లోకేశ్.. సుధాకర్ తల్లిని పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సుధాకర్ కుటుంబానికి న్యాయం జరిగేదాకా జగన్ ప్రభుత్వంపై పోరు సాగిస్తామని ప్రకటించారు.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన లోకేశ్… సుధాకర్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారంతో పాటుగా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఏపీలో జగన్ సాగిస్తున్న పాలనపై లోకేశ్ తనదైన శైలిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దళితులపై వరుసగా చోటుచేసుకుంటున్న దాడులను ప్రస్తావించిన లోకేశ్.. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ అధికారంలోకి వచ్చాక… రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగమే అమలు అవుతోందని, అందులో భాగంగానే రాష్ట్రంలో దళితులపై వరుసగా దాడులు చోటుచేసుకుంటున్నాయని లోకేశ్ ధ్వజమెత్తారు.
తూర్పుగోదావరి జిల్లాలో నమోదైన శిరోముండనం కేసు నుంచి విశాఖలో డాక్టర్ సుధాకర్ పై జరిగిన సర్కారీ దాడి, పులివెందులలో దళిత మహిళపై జరిగిన హత్యాచారం తదితర ఘటనలను ఈ సందర్భంగా లోకేశ్ ప్రస్తావించారు. దళితులైనంత మాత్రాన ప్రభుత్వ తీరును ప్రశ్నించడానికి వీల్లేదా? అని కూడా లోకేశ్ ప్రశ్నించారు.
కరోనా బాధితులకు వైద్య చికిత్సలు అందించే క్రమంలో ప్రాణాలకు తెగించి వైద్యులు సేవలందిస్తుంటే… వారికి అవసరమైన పీపీఈ కిట్లు,, ఫేస్ మాస్కులు కూడా అందించలేకపోతే… జగన్ సర్కారు ఏ మేర పనిచేస్తోందో ఇట్టే అర్థమవుతోందని లోకేశ్ అన్నారు.
కేవలం పిపీఈ కిట్లు, మాస్కులు అడిగిన కారణంగా డాక్టర్ సుధాకర్ పై కక్షకట్టిన మాదిరిగా వ్యవహరించిన ప్రభుత్వం… ఆయనను ఏకంగా 14 నెలల పాటు సస్పెన్షన్ లో పెట్టిందని లోకేశ్ ధ్వజమెత్తారు. ఆ తర్వాత డాక్టర్ సుధాకర్ ను పిచ్చోడిని చేసిన జగన్ సర్కారు… ఆయనను నడిరోడ్డుపై అర్ధనగ్నంగా మార్చి చేతులు వెనక్కు విరిచి కట్టి దారుణంగా హింసిచిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుధాకర్ నే కాకుండా ఆయన కుటంబాన్ని టార్గెట్ చేసిన జగన్ సర్కారు.. సుధాకర్ కుమారుడిపైనా తనదైన శైలిలో కేసులు నమోదు చేసిందని ఆరోపించారు. ఇన్ని రకాలుగా వేధించిన జగన్ సర్కారు… సుధాకర్ కు గుండెపోటు వచ్చేలా చేసిందని, ఈ కారణంగానే సుధాకర్ మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని లోకేశ్ ఆరోపించారు.
ఈ కేసును సుమోటోగా స్వీకరించిన కోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసిన అంశాన్ని కూడా ప్రస్తావించిన లోకేశ్.. సరిగ్గా ఈ కేసులో సీబీఐ దర్యాప్తు చివరి దశకు చేరుకున్న సమయంలో సుధాకర్ గుండెపోటులో చనిపోవడం దురదృష్టకరమన్నారు.
సుధాకర్ మరణించినా… ఈ కేసును తాము వదిలిపెట్టే ప్రసక్తే లేదని లోకేశ్ తేల్చి చెప్పారు. సుధాకర్ కుటుంబానికి న్యాయం జరిగే దాకా టీడీపీ పోరాటం సాగిస్తుందని కూడా లోకేశ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సుధాకర్ తల్లి కూడా మీడియాతో మాట్టాడుతూ తమ కుటుంబానికి తీరని అన్యాయం జరిగిందని, దీనికి బాధ్యులైన వారికి శిక్ష పడేదాకా విశ్రమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
తన కుమారుడికి ఈ గతి పట్టించిన వారిలో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదని కూడా ఆమె శపథం చేశారు. తన కుటుంబానికి లోకేశ్ అండగా నిలిచినంందుకు ఆమె ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.