సోనూసూద్ గురించి కొత్తగా దేశంలో ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరంలేదు. కరోనా వైరస్ యావత్ దేశంపై ఎంతగా ప్రభావం చూపుతోందో బాధితులకు సాయం చేసే విషయంలో సోనూ కూడా అంతే స్ధాయిలో స్పందిస్తున్నారు. కరోనా వైరస్ సంక్షోభంలో సోనూ సాయం అందుకోని రాష్టప్రజలు లేరంటే అతిశయోక్తి కూడా కాదు. అసరమని ఫోన్ చేయటమో, వాట్సప్ లో మెసేజ్ పెట్టడమో లేకపోతే ట్విట్టర్ వేదికగా అడిగితే చాలు ఏదో రూపంలో చేతనైనంతలో సోనూ సాయం చేస్తున్నారు.
దేశం మొత్తంమీద ఇప్పటికి కొన్ని లక్షలమందికి సోను సాయం చేసుంటారనటంలో సందేహంలేదు. ఇపుడిదంతా ఎందుకంటే సోను ఇపుడు ప్రభుత్వానికి సాయం చేస్తున్నారు. ఆపదలో ఉన్నవారిని, బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ ప్రస్తుత కరోనా వైరస్ సంక్షోభంలో ప్రభుత్వమే ఆపదలో పడిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ ప్లాంట్ చాలా అవసరం.
ప్రస్తుతం కోవిడ్ తో చనిపోతున్నవారికన్నా ఆక్సిజన్ అందక చనిపోతున్న రోగులు కూడా వేలల్లోనే ఉంటున్నారు. దాంతో దేశం మొత్తంమీద ఆక్సిజన్ అవసరాలు పెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే అవసరాల మేరకు ఆక్సిజన్ అందటంలేదో డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇదే సమస్య నెల్లూరును కూడా పట్టి పీడిస్తోంది. నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కలెక్టర్ చక్రధర్ బాబు అనుకున్నారట.
ఇదే విషయం లోకల్ మీడియాలో వచ్చింది. ఇదే విషయాన్ని నెల్లూరులోని మిత్రులు సోనుతో ప్రస్తావించారట. అంతేకాకుండా కలెక్టర్ ను కలిసి సోనూతో మాట్లాడించారట. వెంటనే అవసరం ఏమిటో చెప్పమని సోను అడిగారట. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కలెక్టర్ చెప్పారట. వెంటనే అందుకు అవసరమైన రు. 1.5 కోట్ల వివులైన పరికరాలను తాను పంపుతానని హామీ ఇచ్చారట.
రెండు రోజుల్లోనే ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన పరికరాలను తాను పంపుతానని అందుకు స్ధలాన్ని సిద్ధం చేసుకుంటే చాలునని సోను కలెక్టర్ కు స్పష్టం చేశారట. స్ధలం రెడీగానే ఉందని కలెక్టర్ చెప్పగానే పరికరాలను వెంటనే పంపుతానని హామీ ఇచ్చారట సోను. తర్వాత మిత్రులతో మాట్లాడుతు ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాలను తాను ఏ విధంగా పంపుతున్నది చెప్పారట. మొత్తానికి సోను ఇపుడు ప్రభుత్వానికే సాయం చేసే స్ధాయికి ఎదిగిపోయారు.