తెలంగాణలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. విపక్ష నేతగా రేవంత్….ప్రభుత్వ తీరును పలు సందర్భాల్లో ఎండగట్టారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ ను కేసీఆర్ సర్కార్ పలు సందర్భాల్లో ఇబ్బందిపెట్టిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఆ విమర్శలకు తగ్గట్టుగానే …రేవంత్ ను తాజాగా తెలంగాణ పోలీసులు అడ్డుకున్న వైనం చర్చనీయాంశమైంది.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో సరఫరా చేస్తున్న ఉచిత భోజనానికి బ్రేక్ వేసిన కేసీర్ సర్కార్ బ్రేకులు వేసింది. కరోనా వేళ పేదలకు అన్నదానం చేయాలంటూ సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు ఇచ్చిన పిలుపునకు రేవంత్ స్పందించారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద కరోనా రోగులకు అన్నదాన కార్యక్రమాన్ని రేవంత్రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆదివారం గాంధీ ఆస్పత్రికి బయల్దేరిన రేవంత్ రెడ్డిని బేగంపేట వద్ద నడిరోడ్డుపై పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో, పోలీసులు, ప్రభుత్వ తీరుపై రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కూడా పోలీసులలాగే తన విధులు నిర్వర్తిస్తున్నానని, తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో భోజన సరఫరా కార్యక్రమానికి వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడినా…ఫలితం లేకపోవడంతో రేవంత్ వెనుదిరిగారు. ట్విటర్ వేదికగా ప్రభుత్వం, పోలీసుల తీరుపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తెలంగాణ పోలీసుల, ప్రభుత్వ తీరుపై విమర్శలు వస్తున్నాయి. పోలీసులు అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. రేవంత్ ప్రజాప్రతినిధి అని, లాక్ డౌన్ సమయంలో ప్రజాసేవ చేసే హక్కుందని అంటున్నారు. లిఖితపూర్వక ఆదేశాలు లేకుండా రేవంత్ ను అడ్డుకున్న పోలీసులపైన ఐపీసీ 340 సెక్షన్ ప్రకారం కేసు పెట్టవచ్చని సూచిస్తున్నారు.