నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో జగన్ వైఖరిపై సర్వత్రా విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. సొంతపార్టీకి చెందిన ఎంపీపై కక్షగట్టిన జగన్…అక్రమ కేసులు బనాయించి ఇబ్బందిపెడుతున్నారని విపక్ష నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఏపీలో ఎంపీలతో పాటు మీడియాకూ భావప్రకటనా స్వేచ్ఛ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో నియంతపాలన సాగుతోందని విపక్షనేతలు విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే రఘురామ వ్యవహారంలో జగన్ కు హైకోర్టు షాకిచ్చింది. రఘురామను గుంటూరు జిల్లా జైలు నుంచి వెంటనే రమేశ్ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది. రఘురామపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఆయన శరీరంపై గాయాలయ్యాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జిల్లా కోర్టు సమర్పించిన మెడికల్ రిపోర్టుపై హైకోర్టు విచారణ జరిపింది.
కోర్టు అనుమతి లేకుండా రఘురామను దొంగచాటుగా గుంటూరు జీజీహెచ్ వెనుక గేటు నుంచి జిల్లా జైలుకుతరలించారంటూ రఘురామ తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా, రఘురామకు జైలులో ప్రాణహాని ఉందనివాదించారు. హైకోర్టు ఆదేశాలు, సీఐడీ ఆదేశాలను ప్రభుత్వం బేఖాతరు చేసిందని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే రఘురామ తరపు న్యాయవాది వాదనలను రికార్డ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. మెడికల్ రిపోర్టును పరిశీలించిన తర్వాత పూర్తిస్థాయి అఫిడవిట్‌ను ఫైల్ చేయాలని రఘురామ తరపున న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది.
విచారణ సందర్భంగా ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఐడీ కోర్టు, ఏపీ హైకోర్టు ఉత్తర్వుల్లోని కొన్ని అంశాలను మాత్రమే ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో, హైకోర్టు ఉత్తర్వులను సీఐడీ కోర్టు దృష్టికి తీసుకెళ్తామని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. రఘురామను వెంటనే గుంటూరులోని రమేశ్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.