ఎన్నికల్లో గెలిచి కొత్త ప్రభుత్వం ఏర్పడటం ఆలస్యం చేసే పని.. అంతకుముందున్న ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలకు పాతర వేయడమే. గత ప్రభుత్వం కొన్ని మంచి పథకాలు పెట్టినా సరే.. వాటిని కొనసాగించడానికి కొత్త ప్రభుత్వానికి మనసొప్పదు. ఆ పథకాల్ని కొనసాగిస్తే ఎక్కడ ప్రతిపక్షానికి పేరొచ్చేస్తుందో అని పని గట్టుకుని వాటిని ఆపించేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్లో గత పర్యాయం అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అన్ని నగరాలు, పట్టణాల్లో అన్న క్యాంటీన్లు తెరిచి ఐదు రూపాయలకు నామమాత్రపు ధరతో భోజనం పెట్టి పేదల కడుపు నింపుతూ ఉండేది.
ఐతే రెండేళ్ల కిందట వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పట్టుబట్టి అన్న క్యాంటీన్లను ఆపించేశారు. దాని స్థానంలో వేరే పథకం తెస్తామని, పేదలకు తక్కువ ధరకు భోజనం అందిస్తామని ప్రకటించారు కానీ.. ఆ మాట చెల్లుబాటు కాలేదు. అన్న క్యాంటీన్ భవనాలు నిరుపయోగం అయ్యాయి. కట్ చేస్తే ఇప్పుడు తమిళనాట పదేళ్ల అన్నాడీఎంకే పాలనకు తెరపడి.. డీఎంకే అధికారంలోకి వచ్చింది. జయలలిత ఉండగా ‘అమ్మ’ క్యాంటీన్లు పెట్టి పేదలకు నామమాత్రపు రుసుముతో కడుపు నింపడం తెలిసిందే. ఏపీలో ‘అన్న’ క్యాంటీన్లు రావడానికి కూడా ఇదే స్ఫూర్తి. అన్నాడీఎంకే పార్టీకి మంచి పేరు, మైలేజీ ఇచ్చిన పథకం ఇది.
ఐతే డీఎంకే అధికారంలోకి రాగానే వీటిని ఎత్తేస్తారేమో అని చాలామంది అనుకున్నారు. కానీ కొత్త ముఖ్యమంత్రి స్టాలిన్ ఆ పని చేయలేదు. లాక్ డౌన్ వేళ పేదల కడుపు నింపడానికి ‘అమ్మ’ క్యాంటీన్లు ఉపయోగపడతాయని భావించి.. వాటిని కొనసాగిస్తామని ప్రకటించారు స్టాలిన్. ప్రభుత్వం మారినంత మాత్రాన మంచి పథకాలను రద్దు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదన్న విచక్షణను స్టాలిన్ చూపించారు. దీంతో ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదే విచక్షణ ఏపీ ముఖ్యమంత్రి కూడా చూపించి ఉండాల్సిందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.