ఏపీ రాజకీయాల్లో ఇదో చిత్రమైన ఘటన. తమ నాయకుడిని నిలువెల్లా.. విమర్శలతో తిట్టిపోసిన.. `యాక్టర్` అంటూ కించపరిచినా.. పైకి మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూనే.. ఓటింగ్ విషయానికి వచ్చే సరికి మాత్రం.. తిట్టిన వారినే కౌగిలించుకున్నట్టుగా ఉంది.. జనసేన నాయకులు, కేడర్ పరిస్థితి!
తాజాగా వచ్చిన తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన కూటమి ఘోర పరాజయం పాలైంది. కనీసం డిపాజిట్ దక్కించుకునే స్థాయి లో కూడా ఇక్కడ ఈ కూటమి అభ్యర్థికి ఓట్లు రాలకపోవడం గమనార్హం. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకి లా జరిగింది? అనేది ఆసక్తిగా మారింది.
వాస్తవానికి తిరుపతిలో జనసేన అధినేత పవన్‌పైనే బీజేపీ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. గతంలో ఇక్కడ చిరంజీవి గెలిచి ఉండడం, మెగా ఫ్యాన్స్ సహా జనసైనికులు ఎక్కువగా ఉండడం, పవన్ ఒకసారి వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం వంటి పరిణామాలు తమకు కలిసి వస్తాయని కమలనాథులు భావించారు.
అయితే.. అలాంటి పరిస్థితి కనిపించలేదు. పైగా.. వైసీపీ నుంచి ఇక్కడ బరిలో నిలిచిన.. గురుమూర్తి తరఫున వైసీపీ మంత్రులు, నేతలు ప్రచార జోరు పెంచారు. ఈ క్రమంలోనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, టీటీ డీ చైర్మన్ సుబ్బారెడ్డిలు.. జనసేన సెంట్రిక్‌గా విమర్శలు గుప్పించారు.
సుబ్బారెడ్డి.. జనసేనపై తీవ్ర విమర్శలు చేశారు. “ఎలాగూ ఓడిపోవడం ఖాయమని తెలిసే.. బీజేపీకి టికెట్ వదిలేశారు“ అని ఒకసారి.. బీజేపీతో పోట్లాడో.. మాట్లాడో.. టికెట్ తెచ్చుకోవాల్సింది పోయి.. ఇక్కడ కూడా బిజినెస్ చేసుకున్నట్టున్నాడు“ అని మరోసారి వ్యాఖ్యానించారు.
ఇక, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. `యాక్టర్` ప్రచారానికి, ఆయన డైలాగులకు మాకేంకాదు! అంటూ.. కరివేపాకును తీసేసినట్టు తీసేశారు. మరో మంత్రి పేర్నినాని కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. “ఆయన్ని మేం యాక్టర్‌గానే చూస్తున్నాం. ప్రజలు కూడా అలానే చూస్తున్నారు. మాకు అసలు ఏమాత్రం పోటీ ఇవ్వలేరు“ అని వ్యాఖ్యానించారు.
నిజానికి మంత్రులు ఇలాటి వ్యాఖ్యలు చేసినసమయంలో సహజంగానే జనసేన నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చి ఉండాలి. జనసైనికులు పవన్‌పై ఉన్న అభిమానంతో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలకు తగిన బుద్ధి చెప్పేలా.. ఎన్నికల్లో ఆ పార్టీకి దూరంగా ఉండాలి.
కానీ, అనూహ్యంగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో వీరంతా కూడా జగన్ వైపు నిలిచినట్టు స్పష్టమైంది. అంటే.. తమ నేతను బండ బూతులు తిట్టినా.. పోలింగ్ దగ్గరకు వచ్చే సరికి మాత్రం తమ ఓటు జగన్‌కే అని స్పస్టం చేసినట్టుగా పరిశీలకులు చెబుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్న జనసేనను ఎలా లైన్లో పెడతారో చూడాలి.