ఇటీవల కాలంలో ఏపీ రాజకీయం ఎంతలా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికారపక్షం కానీ.. విపక్షం కానీ అవకాశం వస్తే చాలు.. ఘాటు విమర్శల మోత మోగించటమే కాదు.. ఎంతమాట అయినా అనేందుకు మొహమాటపడని పరిస్థితి. మర్యాదల్ని పక్కన పెట్టేయటం ఇటీవల కాలంలో మరింత ఎక్కువైంది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత లోకేశ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిపక్షంపై ప్రతీకారం తీర్చుకునే అంశంపైనే తన సమయాన్ని పెడుతున్న ముఖ్యమంత్రి.. ఆక్సిజన్ అందక పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. మూర్ఖుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి ఎంత ప్రమాదమన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డిని చూస్తే అర్థమవుతుందన్న ఆయన.. ప్రాణవాయువు మీద ఫోకస్ పెట్టాలన్నారు.
ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతున్న ఘటనలు వరుసుగా చోటు చేసుకుంటున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర పోతున్న వైనాన్ని ప్రస్తావించి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఆనంతపురం ఆసుపత్రిలో రోగులు పెద్ద ఎత్తున మరణించారన్నారు. ఇవన్నీ కరోనా మరణాలు కావని.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చోటు చేసుకున్న మరణాలుగా ఆయన మండిపడ్డారు. మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై హత్య కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు.