వైసీపీ లో మరో అలజడి రేగింది. సోషల్ మీడియా సహా సాధారణ మీడియా ముందు నోరు చేసుకుని బండ బూతులతో విరుచుకుపడ్డ.. సినీ నటుడు, ఒకప్పటి వైసీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేసిన వ్యవహారం నుంచి వైసీపీ నాయకులు ఇంకా కోలుకోక ముందే.. ఇప్పుడు మరో దెబ్బ పడనుంది. తాజాగా వైసీపీకి చెందిన అనంతపురం నాయకుడు, ధర్మవరం వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న మాజీ ఎంపీ ఉరఫ్ `న్యూడ్ ఎంపీ` గోరంట్ల మాధవ్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
విజయవాడలో నమోదైన కేసుకు సంబంధించి ఇక్కడి పోలీసులు గురువారం సాయంత్రం అనంతపు రంలోని మాధవ్ నివాసానికి వెళ్లి.. ఆయనకు `41 ఏ` కింద నోటీసులు జారీ చేశారు. మార్చి 5న విచారణకు రావాలని ఆయనకు పిలుపునిచ్చారు. నోటీసులు తీసుకున్న గోరంట్ల వస్తానని వారికి చెప్పినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే.. విచారణకు వెళ్లిన పోలీసులకు గోరంట్ల టీ, కాఫీ, కూల్ డ్రింకులు ఆఫర్ చేయడంతోపాటు.. వారికి సెల్యూట్ కూడా చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
గతంలో సీఐగా పనిచేసిన గోరంట్ల 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమం లోనే అనంతపురం ఎంపీ టికెట్‌ను ఆయనకు ఇచ్చారు. అప్పటి ఎన్నికల్లో వైసీపీ హవాతో ఆయన నెగ్గా రు. బలమైన వాయిస్.. ఎదురుదాడి చేయడంలో బలమైన దూకుడు ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకు న్న గోరంట్ల.. తర్వాత.. అనూహ్యంగా ఓ మహిళతో న్యూడ్ వీడియోలో మాట్లాడుతూ.. పట్టుబడ్డారు. ఈ వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పాకింది.
అయితే.. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా.. వైసీపీ ఆయనను వెనుకేసుకు వచ్చింది. మహిళా సంఘాలు ఆందోళన చేస్తే.. కూడా అప్పటి వైసీపీ సర్కారు పట్టించుకోకుండా.. ఎదురుకేసులు పెట్టించింది. తర్వాత వాటిని వెనక్కి తీసుకున్నారు. కానీ, ఇప్పుడు కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. విజయవాడలో అందిన ఫిర్యాదుల మేరకు గోరంట్లకు తాజాగా నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. ఇటీవల వంశీ, తర్వాత.. పోసాని.. ఇప్పుడు గోరంట్ల వంతు రావడంతో వైసీపీ ఉక్కిరి బిక్కిరికి గురవుతుండడం గమనార్హం.