కరోనా వచ్చినంతనే ఇంటికే పరిమితం కావటం.. సరైన వైద్యం తీసుకోవటం.. ఏ మాత్రం తేడాగా అనిపించినా వెంటనే ఆసుపత్రిలో చేరటం లాంటివి అవసరం. అందుకు భిన్నంగా ఆగమాగం కావటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
కొందరు ఈ విషయాన్ని గుర్తించి.. కరోనాను జయిస్తుంటే.. మరొకందరు ఆగమాగమైపోయి.. తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో కరోనాకేసుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది.
ఇక.. ఆ రాష్ట్రరాజధాని బెంగళూరు సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. రోజురోజుకు కేసుల తీవ్రత పెరుగుతోంది. ఇప్పుడా రాష్ట్రంలో రోజుకు దగ్గర దగ్గర 40వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో.. వైద్య సేవల విషయంలో తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.
రాష్ట్రం మొత్తమ్మీదా సుమారు 40 వేల కేసులు నమోదవుతుంటే.. ఒక్క బెంగళూరు మహానగరంలోనే సింహభాగం కేసులు నమోదుతున్నాయి. కేసులు నమోదువుతున్న టాప్ 10 జిల్లాల్లో మొదటి మూడు జిల్లాల గణాంకాల్ని చూస్తే.. బెంగళూరు జిల్లాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది.
రాష్ట్రం మొత్తం కేసులు 39వేలకు పైనే ఉంటే.. అందులో బెంగళూరు జిల్లా వరకే 22,596 కేసులు నమోదుకావటం చూసినప్పుడు.. మహానగరంలో పరిస్థితి ఎలా ఉందన్నది ఇట్టే అర్థమవుతుంది.
రెండో స్థానంలో మైసూర్ జిల్లా నిలిచింది. రోజులో అక్కడ నమోదవుతున్న కేసులు 1759 మాత్రమే. మొదటి రెండో స్థానాల మధ్య అంతరం చూస్తే.. బెంగళూరు మహానగరం ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటోందన్నది అర్థమవుతుంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. బెంగళూరు జిల్లాలో పాజిటివ్ అయిన వారిలో మూడు వేల రోగులు కనిపించకుండా పోవటం ఆందోళనకు గురి చేస్తోంది. వారంతా ఎక్కడికి వెళ్లారన్నది అర్థం కావట్లేదు. వారి ఫోన్లు స్విఛాప్ కావటం గమనార్హం.
పాజిటివ్ అన్న భయంతో తమ ఫోన్లు బంద్ చేసుకొని సొంతూర్లకు వెళ్లిపోయారా? అన్నది సందేహంగా మారింది. ఎందుకంటే.. ఇలా వెళ్లటం ద్వారా.. వైరస్ ను కొత్త ప్రాంతాలకు వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
వీరిని గుర్తించి.. సరైన వైద్యం చేయించకపోతే ఇబ్బందే అన్న మాట వినిపిస్తోంది. ఈ సంకటం నుంచి కర్ణాటక ప్రభుత్వం ఎలా బయటపడుతుందో?