టాలీవుడ్ సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నటుడిగా సినీ రంగానికి, ఎమ్మెల్యేగా ప్రజా సేవకు, బసవతారకం ఆస్పత్రి ద్వారా వైద్యరంగానికి చేసిన సేవలకు గాను ఈ అవార్డు బాలయ్యను వరించింది. 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న తర్వాత బాలయ్యకు ఈ అవార్డు రావడం విశేషం. ఈ క్రమంలోనే బాలయ్య బాబుకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, హీరో జూనియర్ ఎన్డీఆర్, హీరో కల్యాణ్ రామ్ లతో పాటు పలువురు సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు.
లెజెండరీ ఎన్టీఆర్ వారసత్వాన్ని బాలకృష్ణ కొనసాగిస్తున్నారని, సినీ, రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారని చంద్రబాబు ప్రశంసలతో ముంచెత్తారు. బసవతాకరం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతోమందిని కాపాడుతూ ప్రజాసేవ చేస్తున్నారని అన్నారు. ఎంతోమంది జీవితాలకు స్ఫూర్తినిచ్చిన నిజమైన ఐకానిక్ నాయకుడికి తగిన గౌరవం దక్కిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
మామయ్య బాలకృష్ణకు పద్మభూషణ్ రావడం తమ కుటుంబానికి గర్వకారణమని మంత్రి లోకేశ్ అన్నారు. సుదీర్ఘ ప్రయాణంలో బ్లాక్ బస్టర్ హిట్ల నుంచి మిలియన్ల మందికి స్ఫూర్తినిచ్చే వరకు సినిమా, రాజకీయం, ఆరోగ్య రంగంలో బాలా మామయ్య చేసిన సేవకు ఈ అవార్డు నిదర్శనమన్నారు. సినీ, రాజకీయ, వైద్య రంగాలకు బాలకృష్ణ గారు చేసిన సేవలు అనిర్వచనీయమని, ఆయనకు తగిన గుర్తింపు లభించిందని పవన్ కల్యాణ్ అన్నారు.
ఇక, సినీ రంగానికీ, అలాగే రాజకీయ రంగానికి చేసిన కృషికి, సామాజిక సేవకు గుర్తింపుగా బాలా బాబాయ్ కు పద్మ భూషణ్ పురస్కారం రావడం హర్షణీయమని జూనియర్ ఎన్టీఆర్ అభినందించారు. బాలా బాబాయ్ కు పద్మ భూషణ్ అవార్డు దక్కడం సంతోషంగా ఉందని కల్యాణ్ రామ్ అన్నారు.