- ప్రభుత్వోద్యోగుల పరిస్థితీ ఇంతే
- ఫిబ్రవరిలో 17 వరకు జమకాని సొమ్ము
- ప్రస్తుత నెలలోనూ ఇదే దుస్థితి
- కాంట్రాక్టర్లకు అప్పనంగా 2,800 కోట్లు చెల్లింపు
- ఉద్యోగులకివ్వడానికి మాత్రం అప్పుల వేట
జగన్ ప్రభుత్వం నెలనెలా వేల కోట్ల అప్పులు దూసి తెస్తోంది. కానీ అవన్నీ అస్మదీయ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికే సరిపోతోంది. ప్రభుత్వోద్యోగులు.. మరీముఖ్యంగా రిటైరైన ఉద్యోగులు ప్రతి నెలా వేతనాలు, పెన్షన్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూడాల్సి వస్తోంది.
ఫిబ్రవరి నెలలో 17వ తేదీ వరకు.. శాఖలవారీగా అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం చెల్లిస్తూ వచ్చారు. మార్చిలోనూ దరిదాపుగా ఇదే దుస్థితి. కాకపోతే మున్సిపల్ ఎన్నికలు ఉండడంతో కాస్త ముందుగానే చెల్లింపులు చేశారు. ఈ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లకు లోటేలేదు. పనులు చేసినా చేయకున్నా.. ఠంచనుగా ప్రతి నెలా 28వ తేదీలోపు బిల్లులు చెల్లించేస్తున్నారు.
మరో 2-3 రోజుల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు ఇవ్వాల్సి ఉందని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నా.. ప్రభుత్వ పెద్దలు అంగీకరించడం లేదు. జనవరి చివరిలో కాంట్రాక్టర్లకు రూ.2,800 కోట్లు, ఫిబ్రవరి చివరిలో రూ.2,700 కోట్ల చొప్పున బిల్లులు చెల్లించారు.. దీని ప్రభావం ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లింపులపై పడింది.
రాష్ట్రానికి ఓవర్ డ్రాఫ్టు పరిమితి రూ.2,500 కోట్ల వరకు ఉంది. ఫిబ్రవరిలో పూర్తిస్థాయిలో వేతనాలు, పెన్షన్లు చెల్లింపులకు ఇంకా రూ.1,000 కోట్లు అవసరం కావడంతో రూ.400 కోట్ల రుణానికి నాబార్డుతో ఒప్పందం కుదిరింది. వీటిని ఎలాగోలా వేతనాలకు సర్దుబాటు చేశారు. ఆ తర్వాత ఇతర శాఖల నుంచి కొంత మళ్లించి పెన్షనర్లకు చెల్లించారు.
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీలు వేలం వేయడం ద్వారా వచ్చిన మొత్తాన్ని మార్చిలో వేతనాలకు వాడుకున్నారు. కొందరు కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపేశారు. దీంతో వారు గగ్గోలు పెట్టారు. వ్యవహారం సీఎం జగన్ వరకు వెళ్లింది. త్వరగా వారికి సర్దుబాటు చేయాలని ఆయన ఆదేశించడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
దూసి తెస్తున్న సొమ్మంతా సంక్షేమం పేరుతో ఖర్చు చేసేస్తున్నారని.. సంపద సృష్టి జరగడమే లేదని.. కాంట్రాక్టర్లు ఏం పనులు చేస్తున్నారో తెలియదు గానీ.. బిల్లులు మాత్రం పెడుతున్నారని వారు వాపోతున్నారు. సీఎం ఆదేశాలతో.. ఏదైనా బ్యాంకు నుంచి గానీ, మరో మార్గంలో గానీ అప్పు పుడుతుందేమోనని ప్రయత్నిస్తున్నారు. లేనిపక్షంలో ఇంతటితో ఈ ఆర్థిక సంవత్సరం ఖాతా ముగిసిపోయినట్లేనని అధికారులు చెబుతున్నారు.
నిధుల్లేకపోవడంతో ప్రభుత్వ పెద్దలు చెప్పిన బిల్లులు తప్ప మిగిలిన బిల్లులేవీ చెల్లింపులకు నోచుకోవడం లేదు. దీంతో పెండింగ్ బిల్లులు కొండలా పేరుకుపోతున్నాయి. దీనిని నిలువరించేందుకు ప్రభుత్వం చాలాకాలంగా బిల్లులు స్వీకరించడమే మానేసింది. ఏడాది నుంచి బిల్లుల స్వీకరణపై అనేక రకాల ఆంక్షలు విధిస్తోంది.
ఈ ఆంక్షలన్నీ దాటుకుని వచ్చిన బిల్లులను కూడా ఏదో ఒక కారణం చూపించి రద్దు చేస్తున్నారు. ఇలా వెనక్కి వెళ్లిన బిల్లులను తిరిగి ప్రభుత్వానికి సమర్పించే అవకాశం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిరుడు జూన్ నుంచీ ఇదే తంతు..
గత ఏడాది జూన్ నుంచి వేతనాలు, పెన్షన్ల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. మధ్యలో ఒకట్రెండు నెలలే ఐదో తేదీలోగా ఉద్యోగులకు, పెన్షనర్లకు సొమ్ములు అందాయి. వచ్చే నెల ఎలాగోలా వేతనాలు, పెన్షన్లకు సర్దుబాటు చేస్తే.. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తవుతుందని, ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి కొత్తగా అప్పులు చేసుకోవచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశం.
ఓడీకి వెళ్లడమే మహా పాపమన్నట్లుగా జగన్ సర్కారు వచ్చిన కొత్తలో ఆర్థిక శాఖ భావించేది. సీఎం నిర్వహించే ప్రతి ఆర్థిక సమీక్షలోనూ ఓడీకి వెళ్లకుండా ఆర్థిక నిర్వహణ చేయాలని అధికారులను ఆదేశించేవారు. కొన్ని నెలలపాటు ఆయన ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించిన ఆర్థిక శాఖ.. ఆ తర్వాత యథాతథంగా ఓడీ వెసులుబాటును వినియోగించుకోవడం మొదలుపెట్టింది.
మొదట్లో నవరత్న పథకాల అమలు రోజు కచ్చితంగా ఓడీకి వెళ్లేది. తర్వాత్తర్వాత వేతనాల చెల్లింపుల కోసమూ ఓడీకి వెళ్లక తప్పడం లేదు. అయినప్పటికీ వేతనాలు, పెన్షన్లను పూర్తిగా చెల్లించలేకపోతోంది.
73 వేల కోట్లు దూసుకొచ్చినా..
ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా లాక్డౌన్ ఆంక్షలతో రాష్ట్రం కోల్పోయిన ఆదాయం కంటే.. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా రాష్ట్రానికి అందుబాటులోకి తెచ్చిన అప్పుల ఆదాయం (రూ.25 వేల కోట్లు) అనేక రెట్లు అధికం.
దీనికి తోడు రూ.25 వేల కోట్ల అప్పులిచ్చేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయి. ఈ 50 వేల కోట్లు బడ్జెట్లో పేర్కొన్న అప్పులకు అదనం. ఇవి కాకుండా బడ్జెట్లో చూపకుండా వివిధ కార్పొరేషన్ల నుంచి తెచ్చిన ఆఫ్ బడ్జెట్ అప్పులు రూ.12 వేల కోట్ల వరకు ఉంటాయి.
బడ్జెట్లో అంచనా వేయకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు తెచ్చిన అప్పులు రూ.62 వేల కోట్లు. దరిదాపుగా రూ.75 వేల కోట్లు దూసి తెచ్చారన్న మాట. ఇంత భారీగా అప్పులు చేస్తున్నప్పటికీ నెల తిరిగే సరికి ఉద్యోగులకు, పెన్షనర్లకు సకాలంలో వేతనాలు, పింఛన్లు అందించలేని దుస్థితి. వాటి చెల్లింపులకు మళ్లీ కొత్త అప్పుల కోసం ఎదురుచూసే స్థాయికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది.
గతంలో ఎప్పుడూ ఇలా లేదు
నెలలో 17 రోజులు దాటినా పూర్తి స్థాయిలో పెన్షనర్లకు చెల్లింపులు జరగలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన బొప్పరాజు వెంకటేశ్వర్లు, విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆల్ర్ఫెడ్ మండిపడ్డారు. పెన్షన్లు అందక పెన్షనర్లు తల్లడిల్లిపోతున్నారని వాపోయారు.
పెన్షనర్లకు ఇచ్చాకే ఉద్యోగులకు చెల్లించాలని కూడా ఉద్యోగ సంఘాల నేతలు పదే పదే ఆర్థిక శాఖ అధికారులను కోరుతున్నారు. కానీ ఉపయోగం ఉండడం లేదు. 2019 మొదటి ఆరు నెలల వరకు ఇలాంటి పరిస్థితి చూడలేదని.. రాష్ట్రంలోని 4 లక్షల మంది పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన వచ్చేదని, ప్రభుత్వానికి ఏవైనా తీవ్ర ఇబ్బందులు ఉంటే 2-3 రోజులు మాత్రమే ఆలస్యమయ్యేదని ఆల్ర్ఫెడ్ తెలిపారు.
20 నెలలుగా పెన్షన ఏరోజు వస్తుందో గ్యారెంటీ లేకుండా పోయిందన్నారు. ఓపక్క కరోనా ముప్పు.. అనేక ఖర్చుల నేపథ్యంలో వచ్చే ఆ కొద్దిపాటి పెన్షన కూడా ఎప్పుడు వస్తుందోనని ముసలి ప్రాణాలు ఎదురు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు రకాల బిల్లులు నెలల తరబడి ఆర్థిక శాఖలో పేరుకుపోయాయని.. ఆరు డీఏలకు ఇంతవరకు అతీగతీ లేదన్నారు. కరోనా సాకుతో మార్చి, ఫిబ్రవరి నెలల్లో సగం వేతనాలు కోసేశారని.. వాటిని చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ప్రభుత్వం నుంచ స్పందన లేకపోవడంపై ఆందోళన వ్యక్తంచేశారు.