సుదీర్ఘ రాజకీయజీవితంలో ఎప్పుడూ లేని విధంగా ఒక కేసులో టీడీపీ అధినేతగా.. ఏపీ ప్రతిపక్ష నేతగా వ్యవహరించే వేళలో చంద్రబాబు అరెస్టు కావటం.. నెలల తరబడి జైల్లో గడపాల్సి రావటం తెలిసిందే. చంద్రబాబు జైలుకు వెళ్లటానికి కారణమైన స్కిల్ కేసులో బెయిల్ లభించటంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే.. ఆయనకు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ గత ప్రభుత్వం అప్పట్లో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ను దాఖలు చేసింది.
తాజాగా ఈ పిటిషన్ పై విచారణ సుప్రీంకోర్టులో జరిగింది. పిటిషన్ ను కొట్టేస్తూ జస్టిస్ బేలా త్రివేది నేత్రత్వంలోని ధర్మాసనం కొట్టేసింది. ఛార్జిషీట్ దాఖలు చేసినందుకు బెయిల్ రద్దు పిటిషన్ లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది వెల్లడించారు. 2023 నవంబరులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాలు చేస్తూ అప్పటి ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే.. అవసరమైన సందర్భంలో విచారణకు సహకరించాలని మాత్రం చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచన చేసింది. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ జర్నలిస్టు ఇంప్లీడ్ పిటిషన్ వేయగా.. దాన్ని కొట్టేసిన సుప్రీం ధర్మాసనం సదరు జర్నలిస్టుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
అసలు మీకు.. ఈ కేసుకు సంబంధం ఏంటి? మీరెందుకు ఇందులో జోక్యం చేసుకుంటున్నారు? అంటూ జర్నలిస్టును మందలించింది. అదే సమయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయల్ ను సుప్రీంకోర్టు సమర్థించింది. సంక్రాంతి పండుగ వేళ.. సుప్రీంకోర్టు నుంచి చంద్రబాబుకు భారీ ఊరట లభించిందని చెప్పాలి.