ఇరు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి మొదలైంది. భోగి మంటలతో పండుగకు తెలుగు ప్రజలు స్వాగతం పలికారు. ఏపీ, తెలంగాణతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఏపీ సీఎం చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తన స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలను చంద్రబాబు కుటుంబసమేతంగా ఘనంగా జరుపుకుంటున్నారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ఈ వేడుకల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళలు వేసిన రంగవల్లులను చంద్రబాబు, భువనేశ్వరి, బ్రాహ్మణి, బాలకృష్ణ భార్య వసుంధర తదితరులు పరిశీలించారు. ప్రజలందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు భువనేశ్వరి. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు సంక్రాంతి కానుకగా రూ. 10,116 ఇస్తున్నామని తెలిపారు. ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.
కాగా, తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్శిటీలో నిర్వహించిన భోగి వేడుకల్లో మోహన్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. భోగి మంటలు వేసిన మోహన్ బాబు..సరదాగా ఫ్యామిలీతో గడిపారు. తెలుగువారందరికీ మోహన్ బాబు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పాశ్చాత్య సంస్కృతికి దూరంగా ఉంటూ… మన సంస్కృతి, సంప్రదాయాలను పాటిద్దామన్నారు. జరిగిపోయిన కాలాన్ని మర్చిపోయి, జరగబోయే కాలం గురించి ఆలోచించాలని చెప్పారు.