మాస్ కా బాప్, నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలైన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో పోటీ పడిన డాకు మహారాజ్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టేదిశగా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. తొలి షో నుంచి బాలయ్య అభిమానులతో పాటు న్యూట్రల్ ఆడియన్స్ కూడా సినిమా బాగుందని పాజిటివ్ టాక్ ఇచ్చారు.
డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం, టేకింగ్, ఎలివేషన్లు… బాలయ్య బాబు డైలాగులు, నటన…వెరసి బాలయ్య బాబుకు మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక, థమన్ బీజీఎం సినిమాను వేరే లెవల్ కు తీసుకువెళ్లిందని, థియేటర్లో స్పీకర్లు బద్దలవుతున్నాయని, ఆ బీజీఎంకు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు.
ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. దర్శకుడు బాబీ, నిర్మాత నాగ వంశీ, హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ ఈ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగ వంశీ కీలక అప్డేట్ ఇచ్చారు. సెన్సార్ బోర్డు అనుమతి వస్తే జనవరి 17 నుంచి హిందీ, తమిళంలో కూడా డాకు మహారాజ్ విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించేందుకు కారణమైన చిత్ర టీంకు, అభిభానులకు, ప్రేక్షకులకు వంశీ ధన్యవాదాలు చెప్పారు.