దగ్గుబాటి ఫ్యామిలీకి పోలీసులు షాకిచ్చారు. ఓ హోటల్ కూల్చివేతకు సంబంధించి కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంతో నిర్మాత దగ్గుబాటి సురేష్, హీరో దగ్గుబాటి వెంకటేష్, హీరో దగ్గుబాటి రానా, దగ్గుబాటి అభిరామ్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లోని ఫిలిం నగర్ దక్కన్ హోటల్ కూల్చివేతకు సంబంధించి బాధితుడు నంద కుమార్ నాంపల్లి కోర్టుని ఆశ్రయించడంతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. దీంతో, సంక్రాంతికి వస్తున్నాం చిత్రం రిలీజ్ కు ముందు వెంకీ మామకు షాక్ తగిలినట్లయింది.
ఆ హోటల్ కూల్చివేత వ్యవహారం కోర్టు పరిధిలో పెండింగ్ లో ఉన్న సమయంలో దగ్గుబాటి ఫ్యామిలీ కూల్చివేతలకు పాల్పడిందని నంద కుమార్ ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ దక్కన్ కిచెన్ హోటల్ ను కూల్చివేయడంతో దగ్గుబాటి కుటుంబానికి నాంపల్లి కోర్టు షాకిచ్చింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఆ నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
2022 నవంబరులో ఆ హోటల్ ను పాక్షికంగా ధ్వంసం చేయడంతో బాధితుడు నందకుమార్ కోర్టుని ఆశ్రయించాడు. ఆ హోటల్ పై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది. కానీ, వాటిని పట్టించుకోకుండా 2024 జనవరిలో దక్కన్ హోటల్ ను దగ్గుబాటి కుటుంబం దౌర్జన్యంతో పూర్తిగా కూల్చి వేసిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో, నందకుమార్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఆ నలుగురిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.