తిరుమలలో తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత టీటీడీ ఈవో శ్యామల రావు, అధికారులు, పోలీసులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించిన చంద్రబాబు..ఈ ఘటనకు బాధ్యులయిన అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఈ ఘటనకు కారణమైన డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరనాథ రెడ్డిలను సస్పెండ్ చేశారు. మరో ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ జేఈఓ గౌతమి, టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్ లను బదిలీ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున టీటీడీ ద్వారా ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు. ఆరుగురు మృతుల కుటుంబాల్లో ఒకరికి చొప్పున కాంట్రాక్టు ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఇద్దరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం చేస్తామని చెప్పారు. వారి ఆరోగ్యం మెరుగయ్యే వరకు వైద్య ఖర్చులు భరిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
గాయపడిన మరో 33 మందికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడిన 35 మందికి తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. క్షతగాత్రులను వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
“టీటీడీ బోర్డు చైర్మన్, సభ్యులు, జేఈవో సహా కొండపై అందరూ సమన్వయంతో పనిచేయాలి. దేవుని పవిత్రతకు భంగం కలిగించకూడదు. పెత్తందార్లుగా కాకుండా సేవకులుగా దేవుని సేవలో పాల్గొనాలి. తిరుమల పవిత్రతను కాపాడతానని మరోసారి చెబుతున్నాము. 45 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. 23 ఏళ్లు టీడీపీ అధికారంలో ఉంది. తిరుపతిలో టోకెన్లు ఇస్తున్నారని నాకు కూడా తెలియదు.
అక్కడ మరిన్ని జాగ్రతలు తీసుకోవాల్సి ఉంది. తిరుమలలో ఉన్న తృప్తి… తిరుపతిలో రాదని భక్తులు అంటున్నారు. గత ఐదేళ్లలో కొండపై చాలా అరాచకాలు జరిగాయి. కానీ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తిరుమలకు వచ్చినప్పుడు నేను సామాన్య భక్తుడిగానే ఉంటా. వైకుంఠ ఏకాదశికి ఎన్ని టికెట్లు ఇవ్వాలనేదానిపై నిర్ణయం తీసుకుంటాం.
వెంకటేశ్వరుని సన్నిధిలో ఎలాంటి అపచారాలు జరగకూడదు. తిరుమల పవిత్రతను నిలబెట్టడం ఒక భక్తుడిగా, ముఖ్యమంత్రిగా నా బాధ్యత. ఈ దివ్యక్షేత్రం పవిత్రతను కాపాడేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. మనం చేసిన పనుల వల్ల దేవుని పవిత్రత దెబ్బతినకూడదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే.
రాజకీయాలకు అతీతంగా కలియుగ దైవమైన వెంకటేశ్వరునికి సేవ చేస్తున్నామని ప్రతి ఒక్కరూ అనుకోవాలి. క్రిస్టియన్లు జెరూసలేం, ముస్లింలు మక్కాకు వెళ్తారు. హిందువులు తిరుమల కొండకు వస్తారు. జీవితంలో ఒక్కసారైనా వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులు అనుకుంటారు. వైకుంఠ ఏకాదశి నాడు స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠానికి వెళ్తామని భక్తుల ప్రగాఢ నమ్మకం’ అని చంద్రబాబు చెప్పారు.