అధికారం పోయినా వైసీపీ నేతల దౌర్యన్యాలు మాత్రం తగ్గలేదు. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, నెల్లూరు జిల్లాకు చెందిన రాజకీయవేత్త, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తాజాగా పోలీసు, రెవెన్యూ అధికారులపై బెదిరింపులకు దిగారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అంతుచూస్తామంటూ కాకాణి వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొద్ది రోజుల క్రితం కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచురుడైన వెంకటశేషయ్యపై లైంగిక దాడి కేసు నమోదు అయ్యింది.
లైన్ మెన్ అయిన తన భర్త చనిపోవడంతో తనకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ చాలా కాలం నుంచి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఓ మహిళ వెంకటశేషయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగం వచ్చాక కూడా అతని వేధింపులు ఆగలేదని బాధత మహిళ ఫిర్యాదులో పేర్కొనడంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు వెంకటశేషయ్యను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు అతనికి రిమాండ్ కూడా విధించింది.
అయితే తన ముఖ్య అనుచురుడు అరెస్ట్ కావడంతో కాకాణి నిప్పులు చెరిగారు. ఏకంగా పోలీసు, రెవెన్యూ అధికారులను బెదిరిస్తూ, భయబ్రాంతులకు గురిచేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారులు ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక సీఐ సుబ్బారావు, ఆర్ఐ రవిల అంతు చుస్తానని.. ఇద్దర్నీ శాశ్వతంగా విధులు నిర్వహించకుండా చర్యలు తీసుకుంటామని కాకాణి వార్నింగ్ ఇచ్చారు. పోలీసులపైనే ఈ తరహాలో కాకాణి బెదిరింపులకు దిగడంతో అధికార పార్టీ వర్గాలు మాజీ మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.