ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబుకు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ప్రస్తుతం అంబేద్కర్ చుట్టూనే దేశ పార్లమెంట్ సమావేశాలు తిరుగుతున్నాయి. అంబేద్కర్ పై రాజ్యసభలో కేంద్ర హోమ్‌మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. అంబేద్కర్ ను అమిత్ షా అవమానించారంటూ విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఇండియా కూటమి సభ్యులు ఈ రోజు పార్లమెంట్ తో పాటు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.
అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్త్ రఫ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌లకు ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ లేఖ రాశారు. బాబా సాహేబ్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందనేంటో తెలియజేయాలని లేఖలో కోరారు.
పార్లమెంటులో బాబా సాహెబ్‌ను బీజేపీ అవమానించింది. ప్రతిపక్షాలు ఇంతలా ఆందోళనలు చేస్తున్నా అమిత్ షా కనీసం క్షమాపణలు చెప్పలేదు. మోదీ కూడా అమిత్ షానే సమర్థించడం సరికాదంటూ లేఖలో కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈ అంశంపై మీరు లోతుగా ఆలోచించాలని ప్రజలు ఆశిస్తున్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై మీ అభిప్రాయం తెలియాలని చంద్రబాబు, నితీశ్ కుమార్‌లను కేజ్రీవాల్ కోరారు. దీంతో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న టీడీపీ తరఫున చంద్రబాబు ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.
కాగా, 75వ రాజ్యాంగ వార్షికోత్సవాల సందర్భంగా పార్లమెంట్ లో అమిత్ షా మాట్లాడుతూ.. `ఈ మధ్య చిటికీ మాటికీ అంబేద్కర్ పేరు తలుచుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్.. అంబేద్కర్.. అంబేద్కర్.. అని పదే పదే ఆయన పేరు తలిచే కన్నా దేవుడి పేరు తలుచుకుంటే ఏడు జన్మల వరకు స్వర్గం ప్రాప్తించేది` అంటూ వెంటకారం చేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు జాతీయ రాజకీయాలను వేడెక్కించాయి.