ఆడపిల్లలంటే భారం కాదు బాధ్యత అంటూ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో `సేవ్ గర్ల్ చైల్డ్` పేరిట అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 2కే రన్ ను ప్రారంభించారు. ఇందులో భారీ సంఖ్యలో విద్యార్థలు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభ్యలో నిమ్మల రామాయుడు మాట్లాడుతూ.. ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు.
ఆడపిల్లల సంఖ్య నానాటికీ తగ్గిపోతుంది.. ఒకప్పుడు ఇంట్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోయేవారు.. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదని మంత్రి నిమ్మల అన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని పిలుపునిచ్చారు. తల్లికి సాయం, తండ్రికి స్నేహం, అన్నదమ్ముళ్లకు ఆసరా అయ్యే ఆడపిల్లలను భారం అనుకోకూడదని మంత్రి నిమ్మల హితవు పలికారు. ఆడపిల్ల ఉంటే ఇంటికి అందమని.. అవకాశాలు ఇస్తే వాళ్లు అద్భుతంగా రాణిస్తారని నిమ్మల ఆకాక్షించారు.
భ్రూణ హత్యలను నిర్మూలిద్దాం, ఆడపిల్లలను రక్షించుకుందాం అంటూ నినాదించారు. టీడీపీ సారధ్యంలోని కూటమి ప్రభుత్వం ఆడపిల్లల రక్షణ కోసం ఎంతగానో కృషి చేస్తుందని నిమ్మల పేర్కొన్నారు. ఇక ఇదే సభలో హోమ్ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ` నెలల పిల్లల్లోనూ ఆడదాన్ని చూస్తున్న మృగాలు ఉన్న సమాజంలో బ్రతుకున్నాం. ఆడపిల్లలను పద్ధతిగా పెంచినట్లే, మగపిల్లలను కూడా తల్లిదండ్రులు పెంచితే ఇన్ని ఘోరాలు జరుగుతాయా? డ్రగ్స్ తీసుకుంటేనో, స్మగ్లింగ్ చేస్తేనో కాదు.. ఆడపిల్లలను రక్షిస్తే, హీరోలా చూసే రోజులు రావాలి ` అని అన్నారు.