ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడప వైసీపీ కి కంచుకోట లాంటిది. ఇప్పుడు ఆ కంచుకోటే కూలిపోతోంది. కడప కార్పోరేషన్ లో వైసీపీ జెండాను దించే కార్యక్రమానికి కూటమి నేతల శ్రీకారం చుట్టారు. అసంతృప్తిగా ఉన్న వైసీపీ కార్పొరేటర్లను కూటమిలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే వైసీపీకి చెందిన ఒక కార్పొరేటర్ ఆ పార్టీని వీడి సైకిల్ ఎక్కేసారు. అయితే ఇప్పుడు ఏకంగా మరో ఏడుగురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ గూటికి చేరేందుకు రెడీ అయ్యారంటూ బలంగా వార్తలు వస్తున్నాయి. వీరంతా సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే పసుపు కండువా కప్పుకోబోతున్నారని సమాచారం.
కడప కార్పొరేషన్లో మొత్తం యాభై మంది కార్పొరేటర్లు ఉండగా.. 48 మంది వైసీపీ వాళ్లే ఉన్నారు. ఒకరు ఇండిపెండెంట్, ఒకరు టీడీపీ కార్పొరేటర్ ఉండగా.. ఇండిపెండెంట్ కూడా వైసీపీలోకి జంప్ అయ్యారు. అయితే కొన్ని నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గ్రాండ్ విక్టరీని సాధించి అధికారాన్ని చేపట్టింది. వైసీపీకి కంచుకోట అయినటువంటి కడపలో సైతం కూటమి నేతలు తమ సత్తా ఏంటో చూపించారు.
ఎన్నికల హడావుడి ముగిసింది మొదలు వైసీపీ నుంచి వలసల పర్వం ఊపందుకుంది. పార్టీలోని ముఖ్యనేతల నుంచి కార్పొరేటర్లు, కౌన్సర్ల వరకు వరుసగా జెండా తిప్పేస్తున్నారు. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో పాగా వేసిన టీడీపీ.. ఇప్పుడు కడపపై కన్నేసింది. ఇటీవల 25వ డివిజన్ కార్పొరేటర్ సత్యనారాయణ వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఇక అధికారం ఉన్నప్పుడే పట్టించుకోని పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మరో ఏడుగురు కార్పొరేటర్లు చంద్రబాబు సమక్షంలో సోమవారం తెదేపాలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
మరోవైపు మరికొంత మంది వైసీపీ కార్కొరేటర్లను తమవైపుకు తిప్పుకునేందుకు కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి అప్రమత్తం అయ్యారు. శనివారం సాయంత్రమే వైసీపీ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. అయితే అసంతృప్తిగా ఉన్న కార్పొరేటర్లు సమావేశానికి హాజరు కానట్లు తెలుస్తోంది.