వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ..జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబుపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ పై పద్మ మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు. పార్టీ, ప్రజల విశ్వాసాన్ని జగన్ కోల్పోయారని, అందుకే అధ్యక్ష బాధ్యతలను వైఎస్ విజయమ్మకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబును మార్చాలన్న విజయసాయి వ్యాఖ్యలకు పద్మ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును కాదని ముందు జగన్ ను మార్చాలని చెప్పారు. విజయసాయి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, జగన్ ప్రభుత్వంలో ప్రతి స్కీమ్ వెనక స్కామ్ ఉందని ఆరోపించారు. అయితే, ఆ స్కామ్ లకు సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని అన్నారు.
ఆ వ్యవహారాలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబుపై విజయసాయి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన పద్మ…త్వరలోనే టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో పద్మ ఈ రోజు భేటీ అయ్యారని, ఈ నెల 11న లేదా 12న ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకుకే అవకాశముందని తెలుస్తోంది. మరోసారి పద్మకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.