కాకినాడ పోర్టు వ్యవహారంలో తనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం పట్ల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల తీవ్ర స్థాయిలో మండిపడ్డ సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్, కేవీ రావులపై వివాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చే సమయానికి చంద్రబాబు బతికి ఉంటే జైలుకు వెళ్లడం తథ్యమంటూ బహిరంగంగా విజయసాయి రెడ్డి బెదిరింపులకు దిగారు. ఈయన వ్యాఖ్యలపై ఇప్పటికే టీడీపీ నాయకులు భగ్గుమన్నారు. తాజాగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న విజయవాడ పోలీసులకు విజయసాయి రెడ్డిపై ఫిర్యాదు చేసి బిగ్ షాక్ ఇచ్చారు.
చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును కోరారు. అనంతరం బుద్ధా మీడియాతో మాట్లాడుతూ.. నోరు అదుపులో పెట్టుకోవాలని విజయసాయి రెడ్డికి హితవు పలికారు. వైసీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబును జైల్లో వేస్తాం అంటావా..? అంటే బెదిరించి, బ్లాక్ మెయిల్ చేస్తే భయపడిపోతారా? అని బుద్ధా ప్రశ్నించారు. ఇటువంటి వ్యాఖ్యలు విజయసాయిలోని ఉన్మాదానికి పరాకాష్ఠ అని దుయ్యబట్టారు.
జగన్ బలవంతంగా కాకినాడ పోర్టును లాక్కున్నారన్నది నిజం కాదా..? ఆదాయం వచ్చే ఆస్తులు ఎందుకు అమ్ముతారు..? కేవీ రావు నుంచి మీరెలా తీసుకున్నారో చెప్పగలరా..? అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. జగన్ తప్పు చేయలేదని, బలవంతంగా లాక్కోలేదని రుజువు చేసే దమ్ము ఉందా..? అంటూ విజయసాయి రెడ్డికి ఛాలెంజ్ విసిరారు.
కాకినాడ పోర్టును తమ బంధువులకు ఇప్పించుకునేందుకు విజయసాయి తనను బెదిరించి తక్కువ రేట్లకు షేర్లు లాక్కున్నారని మాజీ ఛైర్మన్ కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు చేస్తే కులం అంటగడుతున్నారని, వైసీపీ తప్పులు ఎత్తి చూపితే.. కులం పేరుతో కుట్రలు చేస్తున్నారని బుద్ధా ఫైర్ అయ్యారు. పోర్టు అంశాన్ని తప్పుదారి పట్టించేందుకు విజయసాయి మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబును బెదిరించినందుకు విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేయాలని.. పోలీసులు చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్తామని బుద్ధా మీడియా ముఖంగా పేర్కొన్నారు. ఇక తాజా పరిణామాల నడుమ విజయసాయి రెడ్డి త్వరలో అరెస్ట్ అవ్వడం ఖాయమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.