టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీకి డిప్యూటీ సీఎంగా, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్.. పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. గ్రామ సీమలను సిరుల సీమలు గా మార్చేందుకు కృషి చేస్తున్నారు. గ్రామాల్లో సమస్యల పరిష్కార లక్ష్యంగా గ్రామసభల నిర్వహణ, పల్లెపండుగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పవన్ చర్యలకు సత్ఫలితంగా ఏపీ తాజాగా నాలుగు నేషనల్ అవార్డ్స్ ను సొంతం చేసుకుంది.
దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిసారి ఏపీలోని నాలుగు గ్రామ పంచాయతీలు జాతీయ పురస్కారాలు సాధించాయి. `సంతృప్తికర తాగునీరు` కేటగిరీలో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం న్యాయం పూడి గ్రామం, `ఆరోగ్యకర` కేటగిరిలో చిత్తూరు జిల్లా ఐరాల మండలం బొమ్మసముద్రం, `పచ్చదనం-పరిశుభద్రత`లో అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం తగరంపూడి, `సామాజిక భద్రత` కేటగిరీలో ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల పంచాయతీకి అవార్డులు వచ్చాయి.
డిసెంబర్ 11న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు గెలుచుకున్న ఆయా గ్రామాల సర్పంచ్ లు మెమెంటో తో పాటు, రూ. 1 కోటి చొప్పున నగదు బహుమతిగా అందుకోనున్నారు. ఇక ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. `ఈ ఘనత స్థానిక సంస్థల బలోపేతం, గ్రామాలు స్వయం సమృద్ధి సాధించే దిశగా, పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దుతూ, స్థానిక పరిపాలనను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వ కృషికి నిదర్శనం. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లకు, పంచాయతీ కార్యదర్శులకు, సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను` అని పవన్ ట్వీట్ చేశారు.